ఖలీల్‌వాడి/ఆర్మూర్, సెప్టెంబర్ 14: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో సోమవారం తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది.
15వ తేదీ వరకు తాము విధించిన గడువు ముగియనుందని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో శనివారం సమావేశమైన కమిటీ ప్రతినిధులు వి.ప్రభాకర్, ఇట్టడి లింగారెడ్డి, దేగాం యాదాగౌడ్, దేవరాం, గంగారాం తదితరులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మాట తప్పిన కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా 16వ తేదీన ఆర్మూర్ డివిజన్ లో ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఎలాంటి షరతుల్లేని రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలేనన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కొందరికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని, రైతుభరోసాకు అతీగతీ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు . రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని, రూ.2లక్షల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.