బోధన్ : బోధన్ పట్టణంలోని సాయిప్రసన్న హైస్కూల్ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిలుగా సినీ నటుడు మానవ కోటేశ్వరరావు ( Manava Koteswara Rao) , ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సామ నర్సారెడ్డి( Sama Narsa reddy ) పాల్గొన్నారు.ఎన్కౌంటర్ చిత్రం మొదలుకొని పలు సినిమాల్లో వివిధ పాత్రలను పోషించిన సినీ నటుడు మానం కోటేశ్వరరావు మాట్లాడుతూ చదువులో మార్కులు సాధించడానికే విద్యార్థులు పరిమితం కాకూడదని, జీవితంలో ఎదగడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ( Communication Skills ) ఎంతో అవసరమని అన్నారు.
స్కూలు పంపితే చాలు.. పిల్లలను టీచర్లే చూసుకుంటారని తల్లిదండ్రులు అనుకోవటం సరికాదని, వారి భవిష్యత్తుకు పునాదులు వేసే పని ఇంటి వద్ద నుంచి ప్రారంభం కావాలని సూచించారు. తెలంగాణ రికగ్నైజేషన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు సామ నర్సారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని బడా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 25 ఏళ్లలో ఒక రెండు బడా కార్పొరేట్ సంస్థల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. తమ తమ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివించాలని, అంతేతప్ప డే స్కాలర్స్ కు సైతం లక్షలాది రూపాయలను వసూలుచేసే బడా కార్పొరేట్ విద్యాసంస్థల్లో కాదని ఆయన అన్నారు.
వార్షికోత్సవంలో సాయిప్రసన్న హై స్కూల్ ప్రిన్సిపాల్ జయప్రకాష్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ, విద్యా వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధి పావులూరి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు శరత్ రెడ్డి, పిట్ల సత్యం, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.