మాచారెడ్డి/ డిచ్పల్లి, మార్చి 9 : భూమిని నమ్ముకొని కోటి ఆశలతో, అప్పు చేసి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నది. దీంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. సాగునీరు అందక చేతికి అందే దశలో పంట ఎండిపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటి వనరుల లభ్యత లేకపోవడం, సాగునీరు అందించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
బోర్లలో నీళ్లు రాక, వేసని పంటలను కాపాడుకోలేక దిగాలు చెందుతున్నారు. యాసంగి సాగులో నీటి కష్టాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. డిచ్పల్లి మండలం ముల్లంగి, పాల్వంచ మండలంలోని పోతారం గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సాగునీటి కోసం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. కండ్ల ఎదుటే పంట ఎండుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎండిపోయిన పంటలు పశువులకు మేతగా మారాయి. అప్పు చేసి బోర్లు మరమ్మతులు చేపట్టినా చుక్కనీరు రావడంలేదు.
పొలం వద్దకు వెళ్తే కన్నీళ్లే..
ఈ చిత్రంలోని రైతు పేరు నవీన్ పటేల్. స్వగ్రామం డిచ్పల్లి మండలంలోని ముల్లంగి. తనకున్న మూడు ఎకరాల్లో వరి, ఎనిమిది ఎకరాల్లో మక్కజొన్న పంట వేశాడు. చివరి తడులకు రాకముందే రెండున్నర ఎకరాల వరి ఎండిపోయింది. అంతవరకు బాగా పోసిన బోరు సైతం ఎత్తిపోయింది. కనీసం అర ఎకరం పంటనైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్ల నుంచి నీరు అడిగాడు. కానీ వారికి చెందిన బోర్లు కూడా ఎత్తిపోవడంతో చేసేదేమీలేక పొలం వద్దకు వెళ్లడమే మానేశాడు.
రూ.లక్ష ఖర్చుచేసినా ఫలితంలేదు..
మూడెకరాల్లో వరి పంట వేశాను. బోర్ మోటర్లో నీరు రాకపో వడంతో రూ.లక్ష ఖర్చు చేసి ఫ్లషింగ్ చేయించిన. చుక్కా నీరు రాలేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీలేక పశువులను మేతకోసం ఎండిన పోలంలోకి వదిలిన.
-ఉబ్బనగారి లింగం, పోతారం, పాల్వంచ మండలం
బోరు వట్టిపోవడం ఇదే తొలిసారి
నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి మా పొలంలోని బోరు ఎప్పడు ఎండిపోలేదు. వేసిన రెండెకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఎండిన పంటను పశువులు మేస్తున్నాయి. నాకు రుణమాఫీ కూడా కాలేదు. రైతుభరోసా కూడా అందలేదు. మా రైతుల పరిస్థితి ఆగమాగంగా మారింది. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి.
-ఇంటెనుక కిషన్, పోతారం, పాల్వంచ మండలం