Interstate criminal | మాచారెడ్డి , జూన్ 15 : ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ కథనం ప్రకారం.. సిపాలా ఈశ్వరయ్య ఆలియాస్ ఈశ్వర్, శివగా చలామణి అవుతున్నాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని పొద్దుటూరు స్వస్థలం కాగా హైదరాబాదు లోని గచ్చిబౌలిలో నివాసముంటున్నాడు.
అతడు ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా అతడికి వచ్చే జీతం సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు ఎలా అని ఆలోచించి సాయం కోరిన వారిని ఆసరాగా చేసుకుని ఏటీఎం సెంటర్ల వద్ద డబ్బులు తీయాలనే వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో మాచారెడ్డి మండలంలోని లచ్చపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నర్సింలు మే 27న మాచారెడ్డి లోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరగా మాయ మాటలు చెప్పి ఆయన ఏటీఎం కార్డు మార్చి ఎల్లారెడ్డిపేట, కూకట్పల్లి ఏటీఎంలో రూ.49వేలు డ్రా చేశాడు.
సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని విచారించగా కామారెడ్డి యూనియన్ బ్యాంక్ ఏటీఎం మార్చి రూ.90వేల600, కడప జిల్లాలోని వేంపల్లి పీఎస్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎం మార్చి రూ.30 వేలు డ్రా చేశాడు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ లో ఓ వృద్ధ మహిళ ఏటీఎం మార్చి రూ.10వేలు మాచారెడ్డి లో నర్సింలు అనే వ్యక్తి ఏటీఎం మార్చి రూ. 49వేలు డ్రా చేసినట్లు నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై గతంలో తూప్రాన్ లో మూడు కేసులు రామయంపేట్ లో ఒకటి, జనగామలో ఒకటి, షాబాద్, సంగారెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీఎస్ లో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి అనిల్, సిబ్బంది శ్రావణ్, శ్రీకాంత్ ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.