వినాయక నగర్/ కంఠేశ్వర్ / బాన్సువాడ టౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Womens Day) నిజామాబాద్( Nizamabad), కామారెడ్డి ( Kamareddy ) జిల్లాలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి, వారిని అభినందించారు.
నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి ( Railway SI Saireddy) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే పోలీసు మహిళా సిబ్బందిని శనివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ తాము ఎందులో తక్కువ లేమని, అన్ని రంగాలలో ముందుంటూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు.
మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ మగవారికి దీటుగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది, మహిళా సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవం కాదు .. పోరాట దినం : ఆకుల పాపయ్య
అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం కాదని, శ్రామిక మహిళా పోరాట దినమని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ( Akula Papaiah) అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ద్వారకా నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ అధ్యక్షత వహించారు.
ఆకుల పాపయ్య మాట్లాడుతూ అన్నిటినీ వక్రీకరించినట్లు పాలకులు ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని ఉత్సవంగా మార్చి మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పాలకులు తమ సంపదను పెంచుకోవడానికి ఆయుధాలను అమ్ముకోవడానికి అమాయక ప్రజల మధ్యన దేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తున్నారని అందులో భాగంగానే గాజా, ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పారు. మహిళల హక్కుల కోసం ఇంకా పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరిత పిట్ల మాట్లాడారు.
సభ అనంతరం ద్వారక నగర్ నుంచి వీక్లీ బజార్ మీదుగా భగత్ సింగ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షురాలు వేల్పూరు లక్ష్మి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు చిట్టెక్క, నిజామాబాద్ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, జి.సంజన, జిల్లా నాయకులు డి.రాధ, సబిత, ఆకుల స్వప్న, మానస,రేఖ పాటు మహిళలు పాల్గొన్నారు.
బాన్సువాడ ఆర్టీసీ బస్ డిపోలో ఘనంగా వేడుకలు
బీజేపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. బాన్సువాడ డిపో ( Banswada RTC Depo ) మేనేజర్ సరిత , మహిళా కండక్టర్లకు శాలువాతో సత్కరించిశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బీజేపీరూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, తృప్తి ప్రసాద్, మోహన్ రెడ్డి, కొనాల గంగారెడ్డి, చీకటి రాజు, చిరంజీవి, వెంకట్, శంకర్, రామకృష్ణ , సాయి రెడ్డి, సాయి ప్రసాద్, శివకుమార్ దత్తు , లక్ష్మణ్, సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.