రుద్రూర్, జూలై 5: మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వారానికి ఒకసారి వేసుకునే ఐరన్ మాత్రలను మోడల్ స్కూల్ ఏఎన్ఎం శుక్రవారం ఉదయం 11గంటలకు విద్యార్థినులకు అందజేశారు. మాత్రలు వేసుకున్న వారిలో ఎనిమిది మంది రాత్రి పది గంటల సమయంలో కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో వారిని హాస్టల్ కేర్ టేకర్ వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స చేయించారు. పరీక్షించిన వైద్యురాలు పద్మజ.. గ్యాస్ట్రిక్ సమస్యతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.
ప్రమాదం లేదన్నారు. ఐరన్ మాత్రలు భోజనం చేసిన అనంతరం వేసుకోవాలని, విద్యార్థినులు భోజనం చేయకుండానే వేసుకోవడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుకొని, డిశ్చార్జి చేస్తామని తెలిపారు. దీంతో హాస్టల్ ఉద్యోగులు, విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికాగానే వెంటనే స్పందించి, దవాఖానకు తరలించి, చికిత్స అందించామని ప్రిన్సిపాల్ చెన్నప్ప తెలిపారు. కాగా.. విద్యార్థినులను భోజనం చేయకుండానే మాత్రలను వేసుకోమనడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులు తిన్నారా లేదా తెలుసుకోకుండా మాత్రలు ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.