ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. త్వరలోనే పబ్లిక్ పరీక్షలు ఉండడంతో ఆ దిశగా విద్యార్థులను సమయాత్తం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వందశాతం ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతీ సబ్జెక్టుపై విద్యార్థులకు ఉన్న సందేహాలను సంబంధిత అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు.
రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలోని పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలకు నెల రోజులు మాత్రమే ఉండడంతో పుస్తకాలతో పోటీ పడుతున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో మూడు విడుతలుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
కామారెడ్డి జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 11 సోషల్ వెల్ఫేర్,4 ట్రైబల్ వెల్ఫేర్,6 మాడల్ స్కూల్, 11 కేజీబీవీ, 1 తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, 6 మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ,20 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 80 కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,223 మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. అందులో జనరల్ ఎంపీసీ 2,425, బైపీసీ 2,798 మొత్తం 5,223 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం 1323, రెండో సంవత్సరం 1229 మొత్తం 2552 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణ..
ఈ ఏడాది ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి సబ్జెక్ట్‌పై మరింత శిక్షణను ఇస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల కన్నా మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు కూడా దృష్టి సారించారు. విద్యార్థులను మెరుగుపరచడానికి వారి వంతు కూడా కృషి చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు. వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులపై, ఆయా సబ్జెక్ట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
15 నుంచి ప్రాక్టికల్స్..
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి 20 వరకు మొదటి విడుత, 21 నుంచి 25 వరకు రెండో విడుత, 26 నుంచి మార్చి 2 వ తేదీ వరకు మూడో విడుత ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 48 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. జనరల్ 44, ఒకేషనల్ 4 సెంటర్లు ఉన్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 2 నుంచి 5 గంటల వరకు రెండు స్పెల్స్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రానికి గంట ముందే విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలో అరగంట ముందుగానే విద్యార్థులను ల్యాబ్‌లోనికి పంపిస్తారు. పరీక్షలు పూర్తయిన తర్వాత పోస్టాఫీస్ ద్వారా జవాబు పత్రాలను పంపిస్తారు.
అన్ని సిద్ధం చేశాం..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధం చేశాం. ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులకు వేసవి దృష్ట్యా తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తప్పకుండా అందజేయాలి.
– షేక్ సలాం, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి, కామారెడ్డి