సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు ప్రవేశ పెడుతున్న చివరి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాత్కాలిక బడ్జెట్‌గానే పరిగణిస్తున్నప్పటికీ ఎన్నికల వేళ కేంద్రం ప్రకటించబోయే తాయిలాల్లో తెలంగాణ రాష్ర్టానికి, అందునా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఏమైనా ప్రయోజనం ఉం టుందా? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. వాస్తవానికి బీజేపీ అధికారం చేపట్టాక ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఉమ్మడి జిల్లాకు ఆశించిన మేర కేటాయింపులు చేయలేదు. ఆర్థిక పరమైన వరాలు గగనం కాగా రైల్వే అభివృద్ధికి సంబంధించినవి కూడా లేవు. పేరుకు ఎలక్ట్రిఫికేషన్ జరిగినప్పటికీ ఆ స్థాయిలో రైళ్ల రాకపోకలను పెంచలేదు. రైల్వే స్టేషన్ల క్రమబద్ధీకరణ నోచుకోలేదు. ఉన్న రైల్వే స్టేషన్లను మూసేస్తుండగా ప్రజా రవాణా కంటే మిన్నగా వాణిజ్యపరమైన గూడ్స్ రైళ్ల రాకపోకలకే కేంద్రం ప్రాముఖ్యతనిస్తున్నది. కొత్త రైళ్ల ప్రతిపాదన దశాబ్దాలుగా కాగితాలకే పరిమితం అవుతుండగా, బీజేపీ ఎంపీలు మాత్రం కేంద్రా న్ని ప్రజల అవసరాలు, డిమాండ్ల మేరకు అడగడంలో వెనుకబడుతు న్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ ఏకంగా తన ఐదేళ్ల పదవీ కాలంలో రైళ్ల అభివృద్ధి కోసం చేసిందేమీ లేకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
గతేడాది అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లా పర్యటనకు ప్రధానమంత్రి మోదీ వచ్చారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటుగా బీజేపీ సభకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చిన మోదీ కీలకమైన ప్రకటన చేశారు. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామంటూ చెప్పడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లువెత్తింది. నరేంద్ర మోదీ ప్రకటన చేసి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, అడుగు ముందుకు పడింది లేదు. కేంద్ర ప్రభుత్వంలో పసుపుబోర్డు ఏర్పాటుకు సంబంధించి నోట్ ఫైల్ ఆమోదానికి మాత్రమే పరిమితం కాగా.. ఎప్పుడు, ఎక్కడ స్థాపిస్తారనే అంశాన్ని కేంద్రం వెల్లడించలేదు. బీజేపీ ఎంపీగా ధర్మపురి అర్వింద్ కూడా పసుపుబోర్డుపై నోరు మెదపడం లేదు. తాను రాసిచ్చిన బాండ్ పేపర్‌కు సమాధానం ఇచ్చానంటూ చెప్పుకోవడం తప్ప పసుపుబోర్డు ఏదని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ 2024-25లోనైనా ఈ అంశం మరోసారి తెరపైకి వస్తుందా? అని పసుపు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వేళ తప్పకుండా బీజేపీ సర్కారు ఈ తరహా మాయజాలాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. పన్ను మినహాయింపులు, పన్ను విధింపులు ఎలా ఉన్నప్పటికీ వేతన జీవులు, కర్షక, కార్మిక లోకానికి తీపి కబురు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు పసుపుబోర్డు ఏర్పాటుపై బడ్జెట్లో ప్రస్తావించాలని, రైల్వే అభివృద్ధిపైనా దృష్టి పెడితే బాగుంటుందని నిజామాబాద్, కామారెడ్డి వాసులు విన్నవిస్తున్నారు.
నిజామాబాద్ జంక్షన్‌గా అవతరించిన తర్వాత డబ్లింగ్ ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనాభాకు తగ్గట్లుగా రైళ్ల రాకపోకలకు అనువుగా డబ్లింగ్ వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యంగా మారింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ప్రజల అవసరాలను గుర్తించడంలో విఫలమవుతున్నది. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ వ్యవస్థతోనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో ఎక్కువగా వాణిజ్యపరమైన అవసరాలకే ఈ ట్రాక్‌ను వినియోగిస్తున్నారు. ప్రజా రవాణాకు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు రైళ్లలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే నిరీక్షణ తప్పడం లేదు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తున్నది. సామాన్య కుటుంబాలకు ఇతర మార్గాల్లో ప్రయాణం అన్నది ఇబ్బందిగా మారింది. ఆర్థికంగా పెను భారం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. డబ్లింగ్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు విస్తారంగా పెరుగతాయి. స్టేషన్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షణలు ఉండవు. నేరుగా గమ్య స్థానాలకు చేరేందుకు మార్గం సుగమం కావడంతో పాటుగా కొత్త మార్గాలు, కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయి. నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్‌కు, మహారాష్ట్రలోని కీలకమైన ప్రాంతాలకు డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏండ్ల నుంచి ఉమ్మడి జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు.