కామారెడ్డి, ఏప్రిల్ 23: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో బుధవారం ఈ ఘ టన చోటు చేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. భిక్కనూరుకు చెందిన రెడ్డి పూజ (17) కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. ఆమె తండ్రి గతంలో చనిపోగా, నానమ్మ గంగవ్వ వద్ద ఉంటూ రోజూ కామారెడ్డికి వెళ్లి వచ్చేది. అయితే, గంగవ్వ దేవునిపల్లిలో నివాసముండే తన కూతురు వద్దకు వెళ్లింది.
మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పూజ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైంది. బుధవారం ఉదయం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నది. ఇది గమనించిన మనువడు మహేశ్ గంగవ్వకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె హుటాహుటిన వచ్చి చూసే సరికి పూజ మంటల్లో కాలిపోయి కనిపించింది. సమాచారమందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.