NIZAMABAD | వినాయక నగర్, ఏప్రిల్ 4 : ఈజీ మనీకి అలవాటు పడి యువతను బెట్టింగ్ మహమ్మారికి అలవాటు చేసి భారీగా డబ్బులు దండుకుంటున్న అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠాను నిజామాబాద్ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. యువతకు డబ్బుల ఆశ చూపించి కమిషన్ పై ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు వేర్వేరు ముఠాల కు సంబంధించిన సభ్యులను అరెస్టు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్ పట్టణంలో ఆన్లైన్ బెట్టింగ్ జూదం నిర్వహిస్తున్న గ్యాంగుల వివరాలను ఆయన వివరించారు. నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాలకు చెందిన ఈ బెట్టింగ్ ముఠా నిర్వాహకులు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులతో సంబంధాలు ఏర్పరచుకొని జిల్లాలో సైతం బెట్టింగ్ మాఫియాను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఆన్లైన్లో బెట్టి నిర్వహిస్తున్న ఈ ఏజెంట్లు పెట్టుబడి పెట్టిన వారి నగదు నుండి 7 శాతం కమిషన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడిందని సీపీ పేర్కొన్నారు. అంతేకాకుండా బెట్టింగ్ గేమ్ ఆడే వారి వద్ద డబ్బులు లేనట్లయితే వారి వద్ద ఉన్న ఆస్తులు వాహనాలు సైతం కుదువ పెట్టుకుని బెట్టింగు ఆడెందుకు డబ్బులు ఇస్తారని సిపి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరెస్ట్ చేసిన బెట్టింగ్ గ్యాంగ్ వివరాలు..
ఆటోనగర్ చెందిన షేక్ ముజీబ్ అహ్మద్, షేక్ నదీమ్, షేక్ జునైద్, షేక్ రేహాన్ అనే నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు, రూ.50వేల నగదు, బ్యాంకు పాస్ బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆర్మూరు పట్టణానికి చెందిన మరో గ్యాంగ్ వివరాలు
ఆర్మూర్ పట్టణానికి చెందిన గట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్ అనే ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. వీరి వద్ద నుండి 34 ద్విచక్ర వాహనాలతో పాటు 4 మొబైల్ ఫోన్లు, రూ. 6వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్యాంగులో సభ్యులుగా ఉన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతో పాటు ఆర్మూర్ ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురు నిందితులు పరార్ లో ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ రెండు బెట్టింగ్ ముటాలను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, నిజామాబాద్ ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి లతోపాటు నిజామాబాద్ సీఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్సు సీఐ అంజయ్య, ఐదో టౌన్ ఎస్సైలు గంగాధర్, లక్ష్మయ్య , ఆర్మూర్ ఎస్ఐ మహేష్ సిబ్బంది తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. వారికి రివార్డులు ఇచ్చి అభినందించనున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.