కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వానలకు జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు రెండుమూడు రోజులుగా వరద పోటెత్తుతున్నది. దీంతో కేవలం ఒక్కరోజులనే ప్రాజెక్ట్‌లోకి 11 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండడంతో ఇప్పటికే 67 టీఎంసీలకు చేరుకున్నది.
ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం ప్రాజెక్ట్‌లోకి లక్షా 51,806 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1086.30అడుగుల (64.036టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది.
-మోర్తాడ్, ఆగస్టు 17
నేడు నిజాంసాగర్ గేట్లు ఎత్తే అవకాశం!
బాన్సువాడ, ఆగస్టు17: మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో నేడు ప్రాజెక్టు ప్రధాన గేట్లు ఎత్తి మంజీరాలోకి నీటిని వదిలే అవకాశం ఉన్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాజెక్టులోకి ఆదివారం సాయం త్రం 50,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1400.90అడుగుల (12.353 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
పొంగి పొర్లుతున్న పోచారం ప్రాజెక్టు..
నాగిరెడ్డిపేట, ఆగస్టు17: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అడుగు ఎత్తులో ప్రాజెక్టుపై నుంచి వరద పొంగిపొర్లుతూ పెద్ద వాగు మీదుగా నిజాంసాగర్‌లోకి వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1.82 టీఎంసీలకు చేరుకోగా.. 8,160 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు నీటిపారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ఎగువ ప్రాంతంలో కురస్తున్న వర్షాలకు లింగంపేట పెద్ద వాగు, గుండారం వాగుల ద్వారా భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. సింగూర్, పోచారం ప్రాజెక్టు నీరు మంజీర వాగులోకి చేరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంత రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నదివైపునకు వెళ్లవద్దని సూచించారు. ప్రాజెక్టు వద్ద ఎస్సై భార్గవ్‌గౌడ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరదకాలువకు నీటివిడుదల
ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో అధికారులు వరదకాలువ హెడ్‌రెగ్యులేటర్ గేట్లను ఎత్తి మొదట మూడు వేల క్యూసెక్కులు, తర్వాత 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరదకాలువలో ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జిల్లా చివరన ఉన్న కమ్మర్పల్లిమండలం నాగాపూర్ గ్రామ సమీపంలోని వరదకాలువ 27.85 కి.మీ వద్ద గేట్లను ఎత్తివేశారు. కాకతీయకాలువకు నాలుగు వేలు, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్‌భగీరథకు 231క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 594 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
మంజీర బ్యాక్‌వాటర్‌లో నీట మునిగిన పంటలు
నాగిరెడ్డిపేట, ఆగస్టు17: సింగూర్, పోచారం ప్రాజెక్టు వరదతో మంజీరా బ్యాక్ వాటర్‌లో పంటలు నీట మునిగాయి. సింగూర్ జలాలతోపాటు పోచారం ప్రాజెక్టు నుంచి వరద ఒకేసారి నిజాంసాగర్‌లోకి పోటెత్తడంతో మండలంలోని గోలిలింగాల, చీనూర్, మేజర్‌వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లి కలాన్, వెంకంపల్లి, మాటూర్ గ్రామ శివారులోని మంజీరా పరిసరప్రాంతంలో ఉన్న సుమారు 200 ఎకరాల వరకు పంటలు నీటి మునిగినట్లు రైతులు చెబుతున్నారు. నీట మునిగిన పంటలను ఏఈవో దివ్య, సిబ్బంది పరిశీలించినట్లు ఏవో సాయికిరణ్ తెలిపారు.