ఆర్మూర్‌టౌన్, మే 21: అనుమానాస్పద స్థితిలో బాలింత మృతిచెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. అత్త, ఆడబిడ్డ కలిసి ఆమెను హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వారిపై మృతురాలి కుటుంబీకులు దాడికి యత్నించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్మూర్ పట్టణంలోని రెండో వార్డు ఒడ్డెర కాలనీలో రెండు నెలల బాలింత మక్కల పూజ (27) అత్త నర్సుతో కలిసి ఒడ్డెర కాలనీలోని కెనాల్ కట్ట వద్ద నివసిస్తున్నది. పూజ భర్త సాయిలు మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి అత్త, కోడలి మధ్య గొడవ జరిగింది. బుధవారం ఉదయం పూజ విగతజీవిగా పడిఉన్నది. అదే కాలనీలో కిరాయి ఇంట్లో నివసించే పూజ ఆడబిడ్డ బుధవారం ఉదయం ఇంటికి వచ్చింది.
అత్త, ఆడబిడ్డ కలిసి బాలింతను చంపి ఉంటారని స్థానికులు, బంధువులు అనుమానం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పూజ కుటుంబీకులు అక్కడికి చేరుకొని వారిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొడవ జరగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలికి రెండు నెలల పాప ఉన్నది. అత్త, ఆడబిడ్డను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.