సుభాష్‌నగర్, జూలై 13 : పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊర పండుగను పురస్కరించుకొని ఇందూరు జన సంద్రంగా మారింది. ఊర పండుగలో ప్రధానమైన పదార్థం సరిని నగరవాసులు తమ ఇండ్లు, పొలాల్లో ఎంతో భక్తిప్రపత్తులతో చల్లుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ గ్రామ దేవతలకు నగరవాసులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
అమ్మవారి తొట్లెలు, బండారి సమర్పణలు, గుగ్గిలం పొగలు, కల్లు సాకలు,యాటల బలులు, డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, భవిష్యవాణి.. ఇలా జిల్లాకేంద్రంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. ఖిల్లా రఘునాథ ఆలయం నుంచి వంశపారంపర్య కళాకారులు శారదాంబ గద్దె ప్రాంగణం నుంచి గ్రామదేవతలను ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పెద్దమ్మ, పగడాలమ్మ, ఐదుచేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, అడెల్లి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, అంకుర పోచమ్మ, బోగంసాని, కొండలరాయుడు, రెండు సారగమ్మలు, పెద్దపులి, ఆసును ఊరేగింపుగా తీసుకువచ్చారు.
పెద్దబజార్, కోటగల్లీ, జెండాగల్లీ, గోల్హనుమాన్, పూలాం గ్, వినాయక్‌నగర్, మహాలక్ష్మీనగర్ మరోవైపు పెద్దబజార్ నుంచి నెహ్రూపార్కు, పాతగంజ్, రైల్వేగేట్, గుర్బాబాదిరోడ్, దుబ్బ, పెద్దమ్మ ఆలయం వరకు గ్రామదేవతలను శోభాయాత్రగా తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సర్వసమాజ్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ప్రవీణ్, పలు పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సరిని దక్కించుకోవడం కోసం భక్తులు పోటీపడ్డారు.