అడవిలో తిరగాల్సిన చిరుతలు ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మేత కోసం వెళ్లే మూగ జీవాలపై తరచూ దాడి చేస్తున్నాయి. పశువులు, మేకలను పొట్టన బెట్టుకుంటూ కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే, తండాలు, శివారు ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ వన్య మృగాలు రైతులు, పశువుల కాపరులను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు, మూడు నెలులగా చిరుతల సంచారం బాగా పెరిగింది. నిజామాబాద్, ఇందల్వాయి, వర్ని ఫారెస్టు రేంజ్ పరిధిలో వీటి ఆనవాళ్లు తరచూ బయటపడ్డాయి. పశువులపై దాడి చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూశాయి. దీంతో జీవాలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లేందుకు పశువుల కాపరులు భయపడుతున్నారు. మరోవైపు, రైతులు సైతం ఒంటరిగా పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.
-వినాయక్‌నగర్, అక్టోబర్ 28
నిజామాబాద్ అటవీ శాఖ పరిధిలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో కన్నా కనీసం 50 శాతం పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో గతంలో కన్నా ఉన్న చిరుతల సంఖ్యతో పోలిస్తే సుమారు 50 శాతం పెరిగినట్లు పేర్కొంటున్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో నార్త్, సౌత్, ఇందల్వాయి, వర్ని రేంజ్‌లతో పాటు ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ రేంజ్‌ల పరిధిలో గతంలో 70 చిరుతలు ఉండగా, ఇప్పుడా సంఖ్య 100కు చేరి ఉంటుందని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఐదేండ్లకోసారి అటవీ విస్తీర్ణంతో పాటు అడవి జంతువుల గణన చేస్తుంటారు. జూన్ లేదా జూలై మాసాలలో చేపట్టే ఈ గణనలో శాకాహార,మాంసా హార జంతువులను లెక్కిస్తారు. 2020లో జరిగిన గణనలో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 చిరుత పులులు ఉన్నట్లు తేలింది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య మరో 50 శాతం పెరిగిందని చెబుతున్నారు. వచ్చే జూన్‌లో మరోసారి అడవీ జంతువుల గణన చేపట్టనున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చిరుతలు గ్రామీణ ప్రాంతాలకు రావడం, మూగజీవాల పై దాడులు చేయడడాన్ని వాటి సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు.అయితే ఈ విషయాని ఫారెస్ట్ అధికారి ద్వారా వివరాలు సేకరించడంతో గత నాలుగేండ్ల క్రితం ఉన్న 70 చిరుత పులల సంఖ్య ఇప్పుడు సుమారు 100 కు చేరిందని చెప్పుకు వచ్చారు.అంటే నాలుగేండ్ల క్రితం వరకు ఉన్న చిరుత పులల సంఖ్యను బట్టి చూస్తే యాభై శాతం చిరుతలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.
సహజంగా అన్ని రకాల జంతువులకు వాటికి కావాల్సిన ఆహారం, నీళ్లు అడవి లోపలే లభించడం వలన అవి ఎక్కువ శాతం బయటికి రావు. వాటికి కావాల్సింది దొరకని సమయంలోనే అవి ఆహారం కోసం ఇలా జనావాసాల వైపు వస్తుంటాయి. ఎక్కడైనా చిరుతలు కానీ, ఇతర వన్య మృగాలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వారు వచ్చి తగు చర్యలు తీసుకుంటారు.
– రవి మోహన్ భట్, ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్