విద్యానగర్, ఆగస్టు 28: ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది. దీంతో భాషకు పటుత్వం పెరుగుతుంది. భాషా ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే సంస్కృతికి పునాది మాతృభాష అని పెద్దలు చెప్పారు. అమ్మచేతి గోరుముద్ద ఎంత మధురంగా ఉంటుందో.. తెలుగు భాష కూడా అంత మధురమైంది. తెలుగు భాష స్థాయి గొప్పది. ప్రపంచంలో తెలుగు భాషస్థాయి గొప్పది. పంచదార కన్నా తీయనైనది..మధురమైనది తెలుగుభాష.
మాతృభాషను విస్మరించొద్దు..
తెలుగు మన మాతృభాష. తల్లి ఒడిలో నుంచి పెరిగి పెద్ద అయ్యేదాక మనం తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం. కానీ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాతృభాషను విస్మరించి ఆంగ్లం వంటి ఇతర భాషలవైపు వెళ్లిపోతే తెలుగు ఎలా మాట్లాడగలుగుతాం. తెలుగులో మాట్లాడకపోతే కొంత కాలానికి తెలుగు పదాలే గుర్తుకు రాకుండా పోతాయి. మాతృభాషను వదిలేసి ఇతర భాషలను పట్టుకోవడం అంటే.. తల్లిని వదిలేసి పినతల్లిని ఆశ్రయించినట్లే అవుతుంది. తమిళం, మళయాళం ఉన్న రాష్ర్టాల్లో అక్కడి ప్రజలు తమ మాతృభాషలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వారికి మాతృభాషాభిమానం మెండుగా ఉన్నది. కానీ, తెలుగువారు మాత్రం తెలుగును వదిలేసి ఇంగ్లిష్లోనే ఎక్కువగా మాట్లాడుతారు. ఇది శోచనీయం. మాతృభాషను మనమే ఆదరించాలి. సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడాలి.
మాతృభాష ఉద్దేశం..
వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. తెలుగుభాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వినియోగం పెంచేందుకు కృషి చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు తెలుగు భాషపై పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచీకరణతో పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేవలం 27శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారని వినికిడి.. లెక్కలు కూడా తెలియజెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాల్లో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ 1999/2002-12లో చేసిన తీర్మానంలో ప్రపంచంలోని 6వేల భాషల్లో 3వేలు కాలగర్భంలో కలిసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మాత్రమే మిగులుతాయని ప్రముఖులు పేర్కొంటున్నారు.