నందిపేట్, నవంబర్ 3 : ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కర్మ, కర్త, క్రియ కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ అడిగింది, అడగనిది కూడా ఇచ్చిన మనసున్న మహారాజు అన్నారు. కేసీఆర్ తన ఆరాధ్య దైవం, ఉద్యమ, రాజకీయ జీవితాన్ని ఇచ్చార న్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏది అడిగినా కాదనలేదని తెలిపారు. ఆయన అండతో రూ. 3వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చా నని వివరించారు. కేసీఆర్ ఆశీస్సులతో, ప్రజల దయతో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో దగా పడ్డ ఎర్రజొన్న రైతులకు బకాయిలు చెల్లించి ఆదుకున్న దేవుడు కేసీఆర్ అన్నారు. అభివృద్ధి ప్రదాతకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ, ఎంపీలు దీవకొండ దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డా.మధుశేఖర్, మార గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినీత, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, సీనియర్ నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, రాజారాం యాదవ్, మహారాష్ట్ర రైతు సంఘం నాయకులు అన్నాసాబ్ మానే, ఘన్‌శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.