మార్కెట్లో అన్ని రేట్లు పెరుగుతాయి ఒక్క పసుపు పంటకు తప్ప.. అందరికీ లాభాలు వస్తాయి ఒక్క రైతులకు తప్ప.. అన్నదాతలు లక్ష్మి పంటగా భావించే పసుపు ధర పాతాళానికి పడి పోయింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో మద్దతు ధర దక్కక రైతాంగం విలవిల్లాడుతున్నది. నిరుడు క్వింటాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు లభించింది. ఈసారి అంతకన్నా ఎక్కువ ధర రావాల్సి ఉండగా, ఈ సీజన్ ఆరంభం నుంచే దారుణంగా పతనమైంది. నిజామాబాద్ మార్కెట్లో రూ.4 వేలకు మించి పలకట్లేదు. రెండ్రోజుల క్రితమైతే రూ.3,500 కూడా దాటలేదు. ఎన్నో కష్టాలకోర్చి పండిస్తే నష్టాలే మిగులుతుండడంతో రైతులు ఇప్పటికే పసుపు సాగు చాలా తగ్గించారు. గతంలో 50 వేల ఎకరాల్లో పండిస్తే, ఈసారి అది 35 వేల ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుత సీజన్లోనూ గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు పునరాలోచనలో పడుతున్నారు. ఫలితంగా వచ్చే సంవత్సరం కూడా పంట సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోనున్నది. పసుపుబోర్డు పేరుతో రాజకీయాలు చేసిన బీజేపీ కానీ, ఆ పార్టీ ఎంపీ అర్వింద్ కానీ రైతుల దుస్థితిపై ప్రస్తుతం కిమ్మనడం లేదు. తాను తీసుకొచ్చిన ‘స్పైసిస్‌బోర్డు’తో ధరలు భారీగా పెరిగాయని ప్రచారం చేసుకున్న అర్వింద్.. రైతుల గోసను పట్టించుకోవడం లేదు.
– నిజామాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు పసుపు రాక మొదలైంది. కొత్త పసుపుతో మార్కెట్ సందడిగా మారింది. భారీగా పసుపు వచ్చి చేరుతున్నప్పటికీ ధరలు మాత్రం పెరగడం లేదు. వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కనిష్ఠ ధర రూ.4వేలు వరకు పలుకుతున్నది. గరిష్ఠ ధర రూ.5వేలు కూడా దాటడం లేదు. రెండు రోజుల క్రితం క్వింటాలు పసుపు అత్యంత తక్కువగా రూ.3,500 పలకడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది కొద్ది మంది రైతులు మాత్రమే అత్యధిక ధరను పొందారు. అది కూడా రూ.6వేలు నుంచి రూ.8వేల వరకు లభించింది. ఇప్పుడు గతేడాది ధరలు కూడా మార్కెట్లో కనిపించడం లేదు. గతేడాది సీజన్‌తో పోలిస్తే దాదాపు రూ.2వేలు పతనంతో ధరలు కొనసాగుతుండడంతో అన్నదాతలను కలిచి వేస్తోంది. పసుపు పంటకు మార్కెట్లో అనుకూల వాతావరణం లేకపోవడంతో జిల్లా రైతన్నలు చాలామంది సాగును తగ్గించుకున్నారు. గతంలో ఒక్కొక్కరూ పది ఎకరాల్లో సాగు చేసేది. అలాంటి వారు పరిస్థితులు సరిగా లేక సగంలో సగానికి సాగును కుదించుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మార్కెట్లో పసుపునకు ధర లేకపోవడంతో వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పతన స్థాయికి…
పసుపు పంట సాగు విస్తీర్ణం రోజురోజుకూ పతనం అవుతున్నది. సాగు పరంగా ఇప్పటికే తగ్గుముఖం పట్టగా ఈసారి సీజన్లో దిగుబడులు సైతం నేలచూపులే చూస్తున్నాయి. ఆశించినంత పంట చేతికి రాకపోవడంతో రైతన్నలు నిరాశకు గురవుతున్నారు. పసుపు పంట ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో వచ్చే సాగు సీజన్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం నెలకొన్నది. గతంతో పోలిస్తే భారీగా పసుపు పంట సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. పసుపు బోర్డు హామీతో ఎంపీగా గెలిచిన అర్వింద్ ఈ అంశంపై కనీసం పట్టించుకోవడం లేదు. పైగా మద్దతు ధర ఊసే ఎత్తడం లేదు. పసుపు సాగు చేసిన రైతులకు తీవ్రమైన నష్టం సంభవిస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఏటా 50వేల ఎకరాల్లో పసుపు సాగు అయ్యేది. ధరల్లో వ్యత్యాసం మూలంగా కొంత కాలంగా విస్తీర్ణం తగ్గుతున్నది. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడి నుంచి మార్కెట్‌కు వస్తున్న పసుపు తక్కువే కనిపిస్తోంది. తెగుళ్లతో ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గింది. ఇందుకు భారీ వర్షాలే కారణం. ఏకధాటి వానల మూలంగా పసుపు పంట దిగుబడిపై తీవ్రంగా ప్ర భావం చూపింది. ప్రతి సంవత్సరం పసుపు ఎకరా కు 20 నుంచి 30 క్వింటాళ్ల మధ్య దిగుబడులు వస్తుండగా ఈసారి 10 నుంచి 20 క్వింటాళ్ల మధ్య నే పరిమితం అవుతున్నది. దుంపకుళ్లు తెగుళ్లతో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది.
శ్రమ వృథానే…
పసుపు పంటకు అంటుకున్న తెగుళ్ల మూలంగా లాభం ఎక్కువగా రాకపోగా ఖర్చు మాత్రం భారీగానే అవుతున్నది. పసుపు రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పసుపు పంటను సాగు చేస్తున్నారు. గ్రామాల్లో పసుపు ఉడికించి ఆరబెట్టి మార్కెట్‌కు తెచ్చి అమ్మకాలు చేయడం ద్వారా ఎకరాకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తున్నది. పసుపు సాగు ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రాసెసింగ్ కోసం ఎకరానికి రూ.1.20లక్షలు వెచ్చించాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. కనీసం పెట్టుబడి పైసలైనా చేతికి వస్తాయా? రాదా? అన్న ఆందోళనలో పసుపు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్‌కు పసుపు పంట రాక మొదలవుతుందో లేదో నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ గత మూడేండ్లుగా నోటికొచ్చిన ప్రకటనలు చేసేది. వాస్తవానికి భిన్నంగా ప్రకటనలు చేసి రైతులను మాయ చేసేది. నిజామాబాద్ మార్కెట్లో రూ.5వేలు కూడా ధర పలకని సమయంలో రూ.10వేలు పలికినట్లుగా చిత్రీకరించి రైతులను మభ్యపెట్టేది. ఇదంతా రైతులు గ్రహించడంతో అసంబద్ధ ప్రకటనలు చేయడానికి ఎంపీ జంకుతున్నాడు. అంతేకాదు ఏటా మార్కెట్లో పరిస్థితులు చేజారుతున్నాయి. మద్దతు ధర అన్నది తగ్గడమే తప్ప పెరగడం కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డుతో పాటు మద్దతు ధర హామీని సైతం అర్వింద్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ అంశంపై నోరు విప్పేందుకు బీజేపీ ఎంపీ ఇష్ట పడడం లేదు. పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయం అంటూ స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్‌ను చూపించి మమ అనిపించేది. మద్దతు ధర విషయంలో కేంద్రం అడుగడుగునా వైఫల్యం కనిపిస్తుండడంతో చేసేది లేక మిన్నకుండిపోతున్నాడు. పసుపు పంట అంశాన్ని గాలికి వదిలేసి లేనిపోని డాంభికాలతో ఎంపీ కాలం గడుపుతున్నాడు.
గింత ఘోరం ఎన్నడూ సూడలే…
చాలా ఏండ్ల సంది పసుపు పంటను సాగు చేస్తున్నం కానీ గింతటి ఘోరం ఎన్నడూ సూడలేదు. నేను 4 ఎకరాల్లో పసుపు వేసిన. 2 ఎకరాల్లో పండించిన పంటను మార్కెట్‌కు తీసుకు వచ్చిన. ఒక ఎకరానికి 50 డ్రమ్ములు రావాల్సి ఉంది. కానీ 2 ఎకరాలు కలిపితే 53 డ్రమ్ములే ఎల్లింది. గిట్లా దిగుబడి వచ్చినంక ఎట్లా పంటను అమ్ముకునేది. ఏం తోస్తలేదు.
– ఎలాల రాజేశ్వర్, పసుపు రైతు, మోర్తాడ్
క్వింటాకు రూ.4,300 పలికింది…
ఈ సారి పసుపు సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచిగా లేదు. నేను 50 బస్తాల పసుపు తెచ్చిన. క్వింటాలుకు రూ.4300 పలికింది. ఈ పైసల్తో పెట్టుబడి కూడా ఎల్లదు. లాభం అన్నది పగటి కలగానే మారింది. ఇకనుంచి పసుపు సాగు చేసుడు మానుకునుడే ఉత్తమం అనిపిస్తుంది. పెట్టిన ఖర్చులు కూడా ఎల్లకపోతే ఎట్లనో ఏమీ అర్థమైతలేదు.
-నారాయణ, పసుపు రైతు