మోర్తాడ్, డిసెంబర్ 13 : మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ‘ఆగని ఇసుక దోపిడీ’ శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టి.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.
తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ తహసీల్ కార్యాలయ సమీపంలో ఉన్న డంపుల నుంచి ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతానికి శుక్రవారం తరలిస్తుండగా మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయడంతోపాటు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
వందలాది ఇసుక ట్రిప్పులు డంపులుగా ఉండగా.. అక్కడి నుంచి ఉదయం 9 గంటల నుంచే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారు. వందలాది ట్రిప్పుల ఇసుక తరలించిన అనంతరం కేవలం మూడు ట్రాక్టర్లను మాత్రమే పట్టుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.