మాచారెడ్డి, ఫిబ్రవరి 28 : మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అడ్డూ అదుపులేకుండా కొనసాగుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘వాగులనూ తోడేస్తున్నారు’ అనే శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై పోలీసులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించారు. పాల్వంచ మర్రి వద్ద ఇసుక లారీతోపాటు మంథనిదేవునిపల్లి గ్రామశివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇసుక డంపులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఆయా గ్రామాల్లోని వాగు శివారుల్లో ఉన్న ఇసుక డంపులను ఖాళీచేయాలని రెవెన్యూ అధికారులు ఇసుకాసురులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘వాగులనూ తోడెస్తున్నారు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులూ అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల శివారుల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు డంపులు చేయవద్దని, నిల్వ చేసిన ఇసుక డంపులను వెంటనే ఖాళీ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇసుకాసురులు డంపులను ఖాళీ చేసినట్లు తెలిసింది. ఇసుక అక్రమ రవాణాపై ఆయా గ్రామాల ప్రజలు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.