జిల్లాలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా..సంబంధిత శాఖలు చేష్టలూడిగి చూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు వంతపాడుతూ..ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని దక్కకుండా అడ్డుకుంటున్నారు. కొన్నిప్రాంతాల్లో ఇసుకాసురులతో అధికారులు చేతులు కలుపడం వివాదాస్పదమైంది. ఇసుక అక్రమ రవాణాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది ఎస్సైలు, సీఐలపై నిఘావర్గాల సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల పనితీరుపై కనీసం సమీక్ష చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇసుకాసురులకు అధికారులే అండదండలు అందించడంతో నదులు, వాగుల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇసుక దందా మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లుగా సాగుతున్నది.
– నిజామాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో ఇసుకమాఫియా రెచ్చిపోతున్నది. సంబంధిత అధికారుల నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక రవాణాకు అడ్డూ అదుపు, రాత్రి, పగలు తేడాలేకుండా సాగుతున్నది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శా ఖల అధికారుల తీరు, సర్కారు పనితీరును తేటతెల్లం చేస్తున్నది. ప్రజా పాలనలో అక్రమాలకు తావు లేదని సీఎం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధమైన దుస్థితి కనిపిస్తుండడం గమనార్హం.
మోర్తాడ్ సమీపంలోని వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. రాత్రుల్లో జాతీయ రహదారి వెంట లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక తరలింపును బట్టబయలు చేసింది. వరుస కథనాలకు జడిసిన జిల్లా యంత్రాంగం చేసేది లేక..తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నతాధికారులతో కలిసి రంగంలోకి దిగినవారంతా అంతకు మునుపే అక్రమార్కులకు సమాచారం అందించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇసుకాసురులు అంతా సర్దుకుని వాహనాలను రహస్య ప్రాంతాలకు తరలించి, సైలెంట్ అయ్యారు. ఇది కొంతమంది రెవెన్యూ అధికారుల లీకులవల్లే జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
మోర్తాడ్‌లో పోలీస్ స్టేషన్ ఎదుట నుంచే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను తనిఖీ చేసినా ఈ ఇసుక తంతు బయట పడుతుంది. కానీ పోలీసులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తుడడం అనుమానాలకు తావిస్తున్నది. కండ్ల ముందే నుంచే రయ్య్‌మ్రంటూ దూసుకుపోతున్న ఇసుక వాహనాలను ఎందుకు పట్టించుకోవడంలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏర్గట్లలోనూ ఇదే తంతు నడుస్తున్నది. ఏర్గట్ల మండలం బుట్టాపూర్‌లో ఇసుక, మొరం, కంకర అక్రమ రవాణా జరుగుతున్నది. బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్, ఏర్గట్ల, మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్ మండలాల్లో చాలాచోట్ల వీడీసీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇసుక అక్ర మ రవాణాలో సంబంధీకులే ముందుండి అర్రస్ పాట పాడుతున్నారు. అక్రమార్కులకు ఇసుకను వేలం ద్వారా అప్పగిస్తున్నారు. లేదంటే ట్రాక్టర్‌కు కొంత చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ చట్ట వ్యతిరేకం. అయినప్పటికీ పోలీసులు, రెవెన్యూ శాఖలకు చెందిన వారంతా వీరికే ప్రాధాన్యతనివ్వడం గమనార్హం.
భీమ్‌గల్ కప్పలవాగులోనూ గుట్టుగా ఇసుక దందా కొనసాగుతున్నది. తనిఖీలకు ఉన్నతాధికారులు వెళ్లినప్పుడల్లా లీకులు బయటికి వస్తున్నాయి. దీనిపై యంత్రాంగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు పురమాయించగానే క్షేత్ర స్థాయిలో వెళ్తే ఎలాంటి హడావుడీ కనిపించడం లేదు. అక్రమార్కులతో అంటకాగుతున్న అధికారులు ముందస్తుగానే తనిఖీల సమాచారం చేరవేయడంతో ఇదంతా జరుగుతున్నదని స్థానికులు చెబుతున్నారు. అధికారులే వాట్సాప్ కాల్స్ చేస్తూ అధికార పార్టీ నేతలకు సమాచారం అందిస్తున్నారు. కోటగిరి, పోతంగల్, బోధన్, రెంజల్ మండలాల్లోనూ ఇదే తరహా వ్యవస్థ నాటుకుపోయింది. బోధన్ డివిజన్లో ఇద్దరు సీఐలు, పలువురు ఎస్సైలపై ఇసుక మామూళ్ల విషయంలో ఆరోపణలు రాగా బదిలీలు చేపట్టారు. అయినప్పటికీ పలుచోట్ల తెర వెనుక ఖాకీలు చేతులు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూగర్భ వనరులకు సంబంధించిన అధికారం భూగర్భ గనుల శాఖ, రెవెన్యూతోపాటు పోలీసులకు సైతం ఉంది. వీరంతా దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక వనరులను గుర్తించి అనుమతులను మంజూరు చేయాల్సిన బాధ్యత భూగర్భ గనుల శాఖది. అనుమతి లేకుండా అక్రమ దందా నడిస్తే నియంత్రించాల్సింది కూడా ఇదే శాఖాధికారులు. ఒకవేళ భూగర్భ గనుల శాఖ కళ్లు గప్పి అక్రమార్కులు దందా కొనసాగించినా రెవెన్యూ యం త్రాంగం కూడా రంగంలోకి దిగి నియంత్రణ చేయొచ్చు. ఇందుకు అనేక చట్టాలు ఆ అధికారాన్ని అప్పగించాయి. ఈ రెండు శాఖలు నిద్ర పోతుంటే పోలీసులైనా రంగంలోకి దిగి అక్రమ రవాణాపై చర్యలు తీసుకునే వీలుంది. లేదంటే తనిఖీలు చేపట్టి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడితే వాటిని మైనింగ్ శాఖకు అప్పగించి జరిమానా విధించేలా ఉసిగొల్పే అవకాశం కూడా ఉంది. ఇంతటి మహాత్తర బాధ్యతలను మీద వేసుకోవాల్సిన వారు మొద్దు నిద్రలో ఉంటున్నారు.