‘బోధన్ నియోజకవర్గంలో నాకు తెలిసి.. ఒక్క టిప్పర్ కూడా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు. ఇసుకను అక్రమంగా తరలిస్తే మేము ఊరుకోవడం లేదు. బాధ్యతగా పని చేస్తున్నాం. అనుమతులతోనే ఇసుకను ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నాం..’ జనవరి 19న నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షలో బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. వాస్తవానికి బోధన్ నియోజకవర్గంలో ఇసుక దందాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. మంజీరాతోపాటు వాగులు, వంకల్లో అక్రమార్కులు పెద్ద ఎత్తును ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తెలియకుండానే గుట్టుగా కొంతమంది ఆయన పేరు చెప్పుకుని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది.
-నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నియోజకవర్గంలో కొంతమంది అధికార పార్టీ నేతలు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పని చేస్తున్నామంటూ సీనియర్ శాసనసభ్యుడు చెబుతున్నప్పటికీ తెర వెనుక గుట్టు చప్పుడు కాకుండా అక్రమ వ్యవహారాలు కొనసాగుతుండడం గమనార్హం. ఎమ్మెల్యే వెంట తిరిగే అనుచరగణమే పెద్దాయన పేరు చెప్పుకుని ఇసుక దోపిడీకి పాల్పడుతున్నది. మాజీ మంత్రికి విషయం తెలిస్తే కష్టమని గ్రహించి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక దందా నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీసులను మచ్చికచేసుకొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాలేవీ సుదర్శన్‌రెడ్డి దరి చేరనీయడంలేదు. ఇందులో భాగంగానే సమీక్షా సమావేశంలో ఒక్క టిప్పర్ ఇసుక కూడా అక్రమంగా తరలివెళ్లడం లేదంటూ బాహాటంగానే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. ఓవైపు అనుచరులు, మరోవైపు పోలీసులు కలిసి ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలిసింది.
బోధన్ మండలంలో మంజీరా ఇసుకను అక్రమంగా తలిస్తుండగా వాహనాలు పట్టుబడ్డాయి. జనవరి 19న ఇసుక అక్రమ రవాణాపై సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయగా అంతకు ముందు, ఆ తర్వాత పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లను అధికార యంత్రాంగం పట్టుకున్నది. దీంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయంపై స్పష్టత వచ్చింది. జనవరి నుంచి ఇప్పటివరకు బోధన్ మండలంలోనే 40 ఇసుక ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. నవీపేట మండలంలో జనవరి ఒకటిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ను తహసీల్దార్ పట్టుకోగా భూగర్భ గనుల శాఖ అధికారులు రూ.30వేలు జరిమానా విధించారు. జనవరి 21న నవీపేట మండలం జన్నేపల్లి వద్ద, ఫిబ్రవరి 2న నవీపేటలో ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ వర్గాలు పట్టుకోగా, మైనింగ్ అధికారులు వాటిపై రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. రెంజల్ మండలంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మూడు ఇసుక వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఒక టిప్పర్‌కు రూ.20వేలు, మరో 2 ట్రాక్టర్లకు రూ.3వేలు చొప్పున జరిమానా విధించి వదిలేశారు. ఇసుక అక్రమంగా తరలించకపోతే రెవెన్యూ, పోలీస్ వర్గాలు ఆ వాహనాలను ఎందుకు ఆపేశారని, ఏ కారణంతో జరిమానాలు విధించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిబ్రవరి 14న ఎడపల్లిలో రెండు టిప్పర్లను రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇసుకతో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలపై దృష్టి సారించిన మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు దాడి చేసి కేసులు నమోదు చేశారు. బోధన్, ఎడపల్లి పోలీసులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో రంగంలోకి రవాణా శాఖ అధికారులు దిగాల్సి వచ్చింది. అనుమతులతో ఇసుకను తరలిస్తున్నామంటూ ఎవరైనా చెప్పుకుంటున్నప్పటికీ ఓవర్ లోడ్‌తో తరలించడం ముమ్మాటికి అక్రమమే.
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని సొంత పార్టీ నేతలే తప్పుదారి పట్టిస్తున్నట్లుగా ఈ ఘటనలతో తెలుస్తోంది. వీరిపై ఆధారపడిన ఎమ్మెల్యే మాత్రం ప్రజా బాహుళ్యంలోకి వచ్చినప్పుడు తన నియోజకవర్గంలో అంతా సక్రమంగానే ఉన్నదని, అక్రమాలేవీ జరగడం లేదంటూ చెబుతున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బోధన్ డివిజన్లో ప్రభుత్వం ఏకంగా ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఏసీపీ స్థాయి వ్యక్తి కూడా బోధన్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉంటున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఘోరంగా తయారైంది. పెద్దాయన ఆదేశాలకు అనుగుణంగా పని చేయడం పక్కన పెడితే.. నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవ వివరాలను అందించడంలో అధికార యం త్రాంగం పూర్తిగా వైఫల్యం చెందుతున్నది. కొత్తగా బోధన్ డివిజన్లో పలువురు సీఐలు బదిలీపై వచ్చారు. వీరి ఆధీనంలోనే ఇదంతా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. గతేడాది సీపీగా కల్మేశ్వర్ సింగెనవార్ ఉన్నప్పుడు డీజీపీకి నిఘా వర్గాలు పంపిన నివేదికలో బోధన్, బోధన్ రూరల్, రెంజల్ ఠాణాలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతున్నదని నివేదికలు వెళ్లాయి. దీంతో పలువురిపై బదిలీ వేటు పడింది. ఒకవేళ ఇసుక అక్రమ రవాణా జరిగి ఉండకపోతే డీజీపీ ఎందుకు స్పందించినట్లు అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిఘా వర్గాలు సైతం కనీసం అప్రమత్తం చేయకపోవడం విడ్డూరంగా మారింది.