జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. బోధన్ విడిజన్లోని మంజీరా నది ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులు నిబంధనలకు క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.ఇసుక క్వారీల నిర్వహణలో పాటించాల్సిన అన్ని రకాల పరిమితులను అతిక్రమిస్తున్నారు.
మంజీరా తీరంలోని అన్ని ఇసుక క్వారీల్లోనూ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. పెద్దక్వారీగా పేరుగాంచిన ఖండ్గావ్ క్వారీలో ఇసుక దోపిడీకి అడ్డూఅదుపులేకుండా పోతున్నది. సెలువు దినమైన గుడ్‌ఫ్రైడే రోజున కూడా ఇసుక తవ్వకాలు చేపడుతుండడం ‘నమస్తే తెలంగాణ’ కంటపడింది. క్షేత్రస్థాయిలో పర్యటించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.
-బోధన్, ఏప్రిల్ 18
బోధన్ డివిజన్లో కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న ఖండ్గావ్ క్వారీ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపులేకుండా మంజీరాలో తవ్వకాలు చేపడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా రు. వందలాది టిప్పర్లు, లారీల్లో ఇసుకను పరిమితికి మించి నింపు తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నియోజకవర్గంలో ‘పెద్దాయన’ సపోర్టు తమకు ఉన్నదనే భావనతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇసుక క్వారీలో తవ్వకాలు చేపట్టడం గమనార్హం. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ ఖండ్గావ్ క్వారీలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా చేపట్టారు. ఈ తతంగమంతా క్వారీ పరిశీలనకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ కంటపడింది.
తమ కు ఎదురే లేదన్నట్లుగా మంజీర మధ్య భాగంలో ఇసుక తవ్వకాలు చేపడుతూ కుప్పలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీతో తవ్వకాలు చేపడుతుండడం కనిపించింది. నిబంధనల ప్రకారం మంజీరా నదిలోని క్వారీలో ఇసుక తవ్వకాలకు జేసీబీలను వాడరాదు. సెలవు రోజే కదా.. ఎవరు చూస్తారులే అనుకున్నారేమో నిర్వాహకులు. యథేచ్ఛగా జేసీబీతో తవ్వకాలను ప్రారంభించారు. ప్రభుత్వ సెలవు దినాల్లోనూ ఇలాగే జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిసింది. సెలవుల అనంతరం ఇసుకను టిప్పర్లు, లారీల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ సెలవు దినాల్లో రెవెన్యూ అధికారులు ఇసుక వాహనాలకు వే బిల్లులు మంజూరుచేయరు. ఇసుక క్వారీల వద్ద రెవెన్యూ సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేని సెలవు దినాల్లో క్వారీ నిర్వాహకులు నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదు. కానీ వే బిల్లులు జారీచేసే రోజుల్లో కూడా ఈ క్వారీలో ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పాటించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, లోడింగ్ చేయడం కూలీల ద్వారా జరగాలి.. ఇది ప్రభుత్వ క్వారీ అయినందున క్వారీ నిర్వహణలో ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ ఎంతమాత్రం ఉండకూడదు. అయితే, ఇక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం సాగిస్తున్నట్లు తెలిసింది. అజమాయిషీ చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖండ్గావ్ క్వారీతో పాటు మంజీరా తీరంలోని క్వారీల్లో ఇసుక తవ్వకాల్లో నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. ఇసుక పరిమాణం ఆధారంగా ఒకటిన్నర మీటరు నుంచి రెండున్నర మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టాలి. ఎంత లోతువరకు తవ్వకాలు చేపట్టాలో మైనింగ్‌శాఖ నిర్దేశిస్తుంది. కానీ ఖండ్క్వారీతో సహా మిగతా క్వారీల్లో ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. ఖండ్గావ్ క్వారీలో పరిమితికి మించి ఎక్కువ లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతలు కనిపించకుండా ఎప్పటికప్పుడు పూడ్చేస్తున్నట్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇలా లోతుగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో భూగర్భజలాలలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతే కాకుండా టిప్పర్లు, లారీల్లో పరిమితికి మించి ఇసుకను నింపుతున్నారు. ఇలా ఓవర్‌లోడ్ ఇసుక వాహనాలతో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతున్నది. ఒక్కో టిప్పర్‌లో 15 టన్నులు (10 క్యూబిక్ మీటర్లు) లోడ్ వేయాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఏకంగా 21 టన్నుల (14 క్యూబిక్ మీటర్లు) ఇసుకను నింపుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నప్పటికీ, పోలీస్, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఈ విషయమై బోధన్ తహసీల్దార్ విఠల్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ అడగగా… నది మధ్యలో జేసీబీతో ఇసుక తవ్వకాలు చేపడుతామని, ఒకవేళ చేపడితే విచారణ నిర్వహిస్తామని తెలిపారు.