జిల్లాలో మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మొరం గుట్టలు కనిపిస్తే చాలు అక్రమార్కులు మాయం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి శివారులోని వరదకాలువ మొరం గుట్టలను అక్రమంగా తవ్వేస్తున్నారు. మొరం తరలించేందుకు పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద పదుల సంఖ్యలో టిప్పర్లను ఉంచుతున్నారు. మధ్యాహ్నం ఖాళీగా కనిపించిన టిప్పర్లు.. రాత్రయితే చాలు అక్రమంగా మొరం తరలిస్తున్నాయి. ఈ అక్రమ దందా ఏడాదికాలంగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
– మోర్తాడ్, మే 12
రాత్రుల్లో తరలింపు
పెట్రోల్ బంక్ వద్ద మధ్యాహ్నం ఖాళీగా కనిపించే టిప్పర్లు.. రాత్రయితే చాలు వాటికి పని చెబుతున్నారు. ప్రతిరోజూ రాత్రి పదిగంటల తర్వాత మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తెల్లవారుజామున 5గంటల వరకు తరలిస్తుండగా.. ఈ అక్రమ దందాను స్థానికులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఏడాదిగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతుండడంతో వరద కాలువ మొరం గుట్టలు మాయమవుతున్నాయి.
ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వరదకాలువ నుంచి మొరం తరలించే టిప్పర్లు పోలీస్‌స్టేషన్ ముందునుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయినా పోలీసులు, అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మొరం దందాకు వెనుక నుంచి అధికారపార్టీకి చెందిన నాయకులే సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొరం తరలింపుపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలియగానే అడపాదడపా వదరకాలువ అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఇచ్చిన అనుమతి కన్నా ఎక్కువ మొరాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి కొడుతున్నారు. అధికారులకు ముడుపులు ముట్టడంవల్లే అటువైపు కన్నెతి కూడా చూడడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమంగా తరలిస్తే చర్యలు..
అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటాం. విషయాన్ని పోలీసుశాఖ వారికి కూడా తెలియజేస్తాం. అప్పుడప్పుడు పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. మొరం అక్రమ తవ్వకాలపై దృష్టి సారిస్తాం. అనుమతులు లేకుండా ఎవరు కూడా మొరం తరలించడానికి వీలులేదు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– ఆంజనేయులు, కమ్మర్పల్లి తహసీల్దార్