రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు మిగతా శాఖలకు భిన్నంగా కొనసాగుతుంటాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సంస్థ ఆధీనంలో లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గిడ్డంగుల నిర్వహణ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ హయాంలో వీటి నిర్వహణ క్రమపద్ధతిలో కొనసాగగా.. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఫలితంగా చివరికి రైతులపై భారం పడుతున్నది.
– నిజామాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రైతులకు కనీస మద్దతు ధరతోపాటు దళారి వ్యవస్థను నిర్మూలించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోయా, మక్కజొన్న, శనగ, ఇతరత్రా వాణిజ్య పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కానీ రైతులకు లాభం చేకూరకపోగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధమైన చర్యలు కనిపిస్తున్నాయి. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన సోయా పంటను నిల్వ చేసేందుకు గిడ్డంగులకు తరలించే క్రమంలో హమాలీ కాంట్రాక్టర్లు డబ్బులు గుంజుతున్నారు. లేదంటే గిడ్డంగుల్లో సోయా ఉత్పత్తులను దించుకునేది లేదంటూ మొండికేస్తున్నారు. టెండర్ నిబంధనలు తుంగలోకి తొక్కి నడస్తున్న ఈ దోపిడీ తంతు బహిరంగంగానే అధికారికంగా కొనసాగుతుండడం గమనార్హం.
పరోక్షంగా రైతులపై భారం
గిడ్డంగుల సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో హమాలీ దోపిడీ ప్రభావం నేరుగా రైతులపై పడుతున్నది. సోయా అమ్ముకున్న రైతుల సరుకును తరలించేందుకు లారీ యజమానులు క్షేత్ర స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. హమాలీ కాంట్రాక్టర్లు తమను అదనంగా డబ్బులు అడుగుతుండడంతో రవాణాదారులు చేసేది లేక రైతుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నా రు. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు గుర్తించినా ఏమీ చేయలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లా భౌగోళిక పరిధికి సంబంధించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి సారంగపూర్‌లోని గిడ్డంగుల సంస్థ ఆవరణలోనే జిల్లా మేనేజర్ కార్యాలయాన్ని నిర్మించేందుకు, గతంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంస్థ అధికారులే అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. గోదాముల్లో ఏదో ఒకప్రదేశంలో సర్దుకోవడం కుదరదంటూ ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా కిరాయి భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయం సర్దుబాటుకు అవకాశం ఉన్నప్పటికీ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నెలకు కిరాయి చొప్పున ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. సమీకృత కలెక్టరేట్‌కు దూరంగా గిడ్డంగుల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతుండడం.. రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణకు అడ్డంకిగా మారింది.
చర్యలు తీసుకుంటాం
హమాలీ కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కాంట్రాక్ట్ నిబంధనల మేరకే హమాలీలను సమకూర్చాలి. అదనంగా ఎవరి నుంచి పైసా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ విషయంపై దృష్టి సారిస్తాం.
– రాజ్యలక్ష్మి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జిల్లా మేనేజర్
సంచికి రూ.3 అదనంగా దోపిడీ
కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా సోయా పంటను సాగు చేస్తుంటారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలోని రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు చెందిన గోదాముల్లో సోయా నిల్వకు చేపడుతున్న చర్యల్లో పారదర్శకత లోపించింది. సోయా కొనుగోలు కేంద్రాల నుంచి గిడ్డంగులకు చేరుతున్న సంచులను దించుకునేందుకు సంస్థకు మానవ వనరుల కొరత ఏర్పడడంతో ఓపెన్ టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ఈ పనిని అప్పగించింది. టెండర్ ప్రక్రియలో అనేక లోటుపాట్లతో పనులు దక్కించుకున్న వారంతా ఇప్పుడు అక్రమాలకు తెరలేపారు. గిడ్డంగుల సంస్థకు చేరిన లారీల్లోని సోయా సంచులను దించుకునే క్రమంలో సంచికి రూ.9 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సంచికి రూ.6 చొప్పున ప్రభుత్వమే సంబంధిత హమాలీ కాంట్రాక్టర్‌కు గిడ్డంగుల కార్పొరేషన్ ద్వారా చెల్లిస్తుంది. అయితే కొందరు కాంట్రాక్టర్లు ఇదికాకుండా సంచికి అదనంగా మరో రూ.3 చొప్పున దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దోపిడీ ముఖ్యంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాముల్లో యథేచ్ఛగా జరుగుతోంది. ఈ విషయంపై హమాలీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్‌కు పలువురు సరుకు రవాణాదారులు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి, చర్య లు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హమాలీ కాంట్రాక్టర్ల దోపిడీలో గిడ్డంగుల సంస్థ అధికారుల పాత్ర ఉన్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.