Gruha Jyoti scheme | కంటేశ్వర్, మే 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపయోగంగా ఉండే విధంగా ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ 200 యూనిట్ల పరిధి కారణంగా అర్హులైన సామాన్యులు కూడా పథక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
గృహ వినియోగంలో 200 యూనిట్లకు ఒక్క యూనిట్ దాటినా విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. వర్షాకాలం, చలికాలం, పక్కనపెడితే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరగడం సహజమే. దాదాపు 45 డిగ్రీల పైన ఉండే ఎండల తీవ్రతకు సామాన్యులు సైతం 24 గంటలూ కూలర్ పెట్టువాల్సిన పరిస్థితి.దీని కారణంగా విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటడంతో సామాన్యులకు అదనపు భారంగా కరెంటు బిల్లు రావడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది.
జిల్లాలో గత నాలుగు నెలలుగా లబ్ధిదారుల సంఖ్యను గమనిస్తే..
జనవరిలో 2,77,171
ఫిబ్రవరి 2,76,493
మార్చి 2,76,050
ఏప్రిల్ 2,60,355
మే నెలలో 2,51,632
లబ్ధిదారుల సంఖ్య నెల నెలా క్రమంగా తగ్గుతూ మే నెలలోనే దాదాపుగా ఎనిమిది వేల మంది లబ్ధిదారులు ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు. అలాగే జనవరి నుండి మే మే వరకు సుమారు 25 వేల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకాన్ని కోల్పోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, నాయకులు సామాన్యుల గురించి ఆలోచించి గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని 200 యూనిట్ల పరిధిని సడలించి పేద ప్రజలు పథకానికి దూరం కాకుండా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సడలింపు ఇచ్చి ఆదుకోవాలి.. బీ వినయ్ కుమార్, సాయి నగర్
ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ద్వారా జీరో బిల్లే వచ్చేది కానీ మే నెలలో బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కనీసం కూలర్ కూడా పెట్టుకోకుంటే ఇంట్లో ఉండలేని పరిస్థితి. కావున ప్రభుత్వం 200 యూనిట్ల పరిధిని కొద్దిపాటి సడలింపు ఇచ్చి తమను ఆదుకోవాలి.