నవీపేట/మాక్లూర్, డిసెంబర్ 21: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యకేసుల్లో మృతుడు పూనే ప్రసాద్, భార్య శాన్విక అలియాస్ రమణి(28) మృతదేహాలను పోలీసులు ఎట్టకేలకు గురువారం గుర్తించారు. నవీపేట మండలం యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో గోదావరి నది ఒడ్డుకు చేరుకున్న శాన్విక మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏసీపీ శ్రీనివాస్‌రావు, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్‌కుమార్, సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై యాదగిరిగౌడ్ ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోవడంతో ఘటనా స్థలంలోనే నవీపేట డిప్యూటీ తహసీల్దార్ హజీ, ఆర్ఐ మోహన్ సమక్షంలో పంచనామా చేసి అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. సీఐ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ మృతదేహాన్ని అత్త సుశీల, తల్లి కళావతి గుర్తు పట్టినట్లు తెలిపారు. పోస్టు మార్టం అనంతరం శాన్విక మృతదేహాన్ని బంధువులకు అప్ప చెప్పినట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు.
నిందితుడు ప్రశాంత్ సమాచారం మేరకు మాక్లూర్ మండలం మదన్‌పల్లి శివారు ప్రాంతంలో ప్రసాద్‌ను హత్య చేసి పూడ్చిన స్థలంలో పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీశారు. అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా చేశారు. నిందితుడు ప్రశాంత్.. ప్రసాద్‌ను నవంబర్ 29న హత్యచేసి పూడ్చిపెట్టాడని, శవం పూర్తిగా కుళ్లిపోయిందని నార్త్ రూరల్ సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. తహసీల్దార్ షబ్బీర్ సమక్షంలో అధికారులు ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ, మాక్లూర్, నవీపేట్ ఎస్సైలు సుధీర్‌రావు, యాదగిరిగౌడ్, సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తును నిర్వహించారు. శాన్విక మృతదేహాన్ని చూసి మాక్లూర్ గ్రామస్తులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.