కోటగిరి/మద్నూర్, సెప్టెంబర్ 15: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి సొంత కుటుంబ సభ్యులపైనే కత్తిదూశారు. కుటుంబ తగాదాల కారణంగా కట్టుకున్నోడే కాలయముడై భార్యను హతమార్చాడు. మరో యువకుడు తనకు రెండో పెండ్లి చేయడంలేదనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటనలు ఉమ్మడి జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన నిమ్మల పోశెట్టి-అంజని(45) దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అంజని ఆశ కార్యకర్తగా పని చేస్తుండేది. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తపై అంజని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోశెట్టిలో మార్పు రాలేదు. మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్త ప్రవర్తనకు విసుగెత్తిన అంజని.. జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. చివరకు కొన్ని రోజుల తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. పోశెట్టి తీరు మారకపోగా, మద్యం తాగి ప్రతిరోజూ గొడవ చేయడంతో గ్రామ పెద్దలు కూడా నచ్చజెప్పారు.
బుధవారం రాత్రి సైతం పోశెట్టి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. కోపంలో విచక్షణ కోల్పోయి భార్యను గొడ్డలితో నరికి, కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. తల్లిపై దాడిచేయడం గమనించిన కూతురు రచన.. వెంటనే బయటికి వెళ్లి బంధువులకు తెలిపింది. వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో అంజని మృతదేహం కనిపించింది. కుటుంబీకులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకొని పోశెట్టిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, రుద్రూర్ సీఐ జాన్‌రెడ్డి, స్థానిక ఎస్సై రాము పరిశీలించారు. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించామని ఎస్సై రాము తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
తనకు రెండో పెండ్లి చేయడానికి ఒప్పకోవడంలేదని తల్లిని నరికిచంపిన ఘటన మద్నూర్ మండలం మొఘ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌బీ (55), మహబూబ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు గ్రామంలోనే ఉంటున్నాడు. చిన్న కొడుకు సలావుద్దీన్ హైదరాబాద్‌లో కూలిపని చేసుకుంటున్నాడు. చిన్న కొడుకు భార్య రెండేండ్ల క్రితం గుండెపోటుతో మరణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న సలావుద్దీన్.. మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. తనకు రెండో పెండ్లి చేయాలంటూ బుధవారం రాత్రి తల్లితో గొడవపడ్డాడు. దీనికి తల్లి అంగీకరించలేదు. తల్లిపై కోపం పెంచుకున్న సలావుద్దీన్ అదేరోజు రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థ్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితుడు సలావుద్దీన్‌ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.