మాక్లూర్, మే 1: ఎండ తీవ్రత ఓ వైపు ..మరోవైపు పెండ్లిళ్ల సీజన్ కావడవంతో ఉమ్మడి జిల్లాలో బీర్ల విక్రయాలు జోరు గా కొనసాగాయి. మార్చి నుంచి మే31 వరకు మూడు నెలల్లో సర్కారుకు దండి గా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 29 బార్లు, 151 వైన్స్ షాపులు ఉన్నాయి. మాక్లూర్ మండలం మాదాపూర్‌లోని ఇండియన్ మేడ్ లిక్కర్ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాకు మద్యం సరఫరా అవుతుంది. వేసవి తాపం పేరిట యువత బీర్లను ఫుల్లుగా లాంగించేశారు. ఓ వైపు యువత మత్తులో జోగితే, మరోవైపు సర్కారుకు దండిగా ఆదాయం సమకూరింది. మార్చిలో లక్షా 16వేల బీర్ కేసులు, 2.66లక్షల లిక్కర్ కేసులు విక్రయించగా రూ.139కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో 2లక్షల 66వేల బీరు కేసులు, లక్షా35వేల లిక్కర్ కేసులు విక్రయించగా రూ.143కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో 2లక్షల 64వేల బీరు కేసులు, లక్షా50వేల లిక్కర్ కేసులు విక్రయించగా రూ.158.18కోట్ల ఆదాయం సమకూరింది . ఒక్క ‘మే’లోనే దంచి కొట్టినా ఎండలకు రూ.158.18కోట్లు వచ్చాయి. వేసవి తాపానికి తట్టుకోలేకపోవడంతో బీర్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ఎక్సైజ్ అధికారులు రేషన్ పద్ధతిలో వైన్స్‌లు, బార్లకు పంపిణీ చేశారు. లిక్కర్ కన్నా బీర్లకు దండిగా ఆదాయం లభించగా సర్కారు ఖజానాకు మూడు నెలల్లో ముచ్చటగా రూ.440.18కోట్ల మద్యాన్ని ఉమ్మడి జిల్లా వాసులు తాగేశారు. ఎన్నికల సమయంలో మూడు రోజులు వైన్సు లు బందు లేకుంటే మరింత ఆదాయం వచ్చేదని అన్నారు.