నిజామాబాద్, సెప్టెంబర్ 4,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై నిర్భంధకాండ కొనసాగింది. ప్రజాపాలన పేరిట పరిపాలన కొనసాగిస్తోన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుండగా అడుగడుగునా ఆంక్షలు విధించడం హాస్యాస్పదంగా మారింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి టూర్ కొనసాగింది. హెలికాప్టర్లో ఇలా వచ్చి అలా వెళ్లిన సీఎంను వరద బాధితులు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటారనే భయంతో పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత హక్కును కాలరాస్తూ తెల్లవారుజాము నుంచే గులాబీ పార్టీ ముఖ్య నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. బుధవారం రాత్రి నుంచే ఖాకీలను కాపలాగా పెట్టి బయటకు వెళ్లకుండా నిర్భంధించారు. ఉదయం అరెస్ట్ చేసినట్లుగా చెప్పి ఠాణాలకు తరలించారు. కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోన్న నిరంకుశత్వాన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వరద బాధితుల సమస్యలను విన్నవిస్తామని చెప్పినందుకు గృహ నిర్భాంధాలకు పాల్పడటం విచిత్రంగా మారిందంటూ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు.
తొమ్మిది రోజులకు టూర్..
కనీవిని ఎరుగని రీతిలో కామారెడ్డిలో ఆగస్టు 27న అతి భారీ వర్షం కురిసింది. మెదక్, కామారెడ్డి జిల్లాలను కుంభవృష్టి వానలు తీవ్ర స్థాయిలో దెబ్బతీసింది. వరద ధాటికి ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి జనాలకు లేకుండా పోయింది. ఆహాకారాలతో చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేసి చాలామంది ప్రాణాలతో బయట పడ్డారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, కామారెడ్డి పోలీసుల కఠోర శ్రమతో జనాలంతా సురక్షితంగా బయట పడ్డారు. వాగులు, వంకల్లో జిల్లా వ్యాప్తంగా ముగ్గురు గల్లంతై మృత్యువాతకు గురయ్యారు. కామారెడ్డి చరిత్రలోనే గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ చూడని వానలతో అంతా అతలాకుతలం చేసింది.
వరద మిగిల్చిన నష్టం సామాన్య కుటుంబాలను కుదేలు చేసింది. వాన పడితే జంకిపోయే పరిస్థితిలో వరద బాధితులు ఉండిపోయారు. వినాయక చవితి రోజే భారీ వరద విలయ తాండవం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా తొమ్మిది రోజులకు కామారెడ్డి పర్యటనకు వచ్చారు. మధ్యలో ఓసారి ఆకాశ మార్గంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. మెదక్లో రివ్యూ పెట్టి అట్నుంచి అటే వెళ్లి పోయారు. కామారెడ్డి టూర్లో బాధితులకు ఆశించిన స్థాయిలో వరద సాయం ఇవ్వకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయగా సర్కారు మాత్రం మొక్కుబడి సాయంతోనే సరిపెడుతుండటంపై వీస్తూగొల్పుతోంది.
నిర్బంధాలు ఎందుకు?
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వరదలు సృష్టించిన విలయంలో పాడి పంటలు ఓ రకంగా సర్వ నాశనమయ్యాయి. ప్రధానంగా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వరదలు ముంచెత్తాయి. కళ్యాణి ప్రాజెక్టు తెగిపోగా పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచులోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. తొమ్మిది రోజులైనప్పటికీ వరద సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో పంట నష్టాన్ని చవి చూసిన బాధితుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం దృష్టికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద నష్టం వివరాలు అందించి సాయం కోరేందుకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపునిచ్చారు.
వరదల్లో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడమే ధ్యేయంగా జాజాల సీఎంను కలిసేందుకు నిర్ణయించగా కాంగ్రెస్ పార్టీ కంగుతిన్నది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను సీఎంతో కలిపిస్తే పరువు పోతుందని ఊహించుకుని పోలీసులతో అడ్డుతగిలారు. గురువారం పర్యటన ఉండగా బుధవారం నుంచే ఎక్కడిక్కకడే అరెస్టులు, గృహ నిర్భంధాలకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యపద్ధతిలో సీఎంకు వినతి సమర్పిస్తామంటే కాంగ్రెస్ సర్కారు అనుమతివ్వకపోవడంపై జాజాల సురేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం టూర్ నేపథ్యంలో నిరసన చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం నిర్భంధాలకే మొగ్గు చూపారు. భారతీయ జనతా పార్టీ నేతల జోలికి మాత్రం వెళ్లలేదు.