వినాయక్‌నగర్, ఆగస్టు 24: మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకునే వీలుంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహాక చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో శనివారం నిర్వహించిన కమ్యూనిటీ మీడియేటర్స్‌కు మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పౌర సమాజంలో ఎక్కడ వివాదాలు ఉంటాయో, పరిష్కారాలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు.
భవనానికి పునాది ఎంత బలమైనదో మధ్యవర్తిత్వానికి కమ్యూనిటీ మీడియేటర్స్ అంత బలమైన వారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్ రావు అన్నారు. సమయానుకూలంగా సమస్యలు విని,అర్థం చేసుకొని న్యాయార్థులను పరిష్కరించుకునే దిశగా ప్రేరేపించాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్, మధ్యవర్తిత్వ వ్యవస్థలలో కమ్యూనిటీ మీడియేటర్స్ ప్రధాన భూమిక పోషించాలని కోరారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, మొమెంటర్స్ డాక్టర్ మహ్మద్ షమీమ్, గిరిబాల సింగ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అదనపు జిల్లా జడ్జీలు శ్రీనివాస్, ఆశాలత,సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్‌బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు గోపికృష్ణ, చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్‌కుమార్ సుబేదార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయకృష్ణ, ప్రమోద్, శుభం, న్యాయవాదులు మానిక్‌రాజ్, ఆశనారాయణ, పర్యవేక్షకులు పురుశోత్తంగౌడ్, చంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.