నిజామాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వానలు ముగింపు సమయంలో దంచి కొడుతున్నాయి. సెప్టెంబర్ నెల ఆరంభంతోనే అతి భారీ వానలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, ఎల్లారెడ్డి తదితర పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి నీరువచ్చి చేరింది. మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామానికి చెందిన కైరం కొండ శివరాములు (55) అనే మత్స్య కార్మికుడు చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతు కాగా.. స్థానిక ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల ఇసుక మేటలతో పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా ఏపు గా పెరిగిన వరి పంట నేలకొరిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నాగారం గ్రామ శివారులోని పెద్దవాగును కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి తగ్గేవరకు రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల కుండపోత వాన కురియగా, 25 మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదు కాగా మిగిలిన చోట్ల భారీ నుంచి సాధారణ వర్ష్షపాతం నమోదైంది.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా సిరికొండ మండలం తూంపల్లిలో 11.6సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలం సర్వాపూర్‌లో 14.4సెం.మీ, గాంధారిలో 12.9సెం.మీ, కామారెడ్డి కలెక్టరేట్లో 12.8సెం.మీ, లింగంపేటలో 11.7సెం.మీ చొప్పున రికార్డు స్థాయిలో వానలు కురిశాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలుచోట్ల రెడ్ అలర్ట్, కొన్నిచోట్ల ఆరెంజ్ అలర్ట్‌ను విడుదల చేసింది. లింగంపేట మండలం మెంగారం, నాగారం శివారులో వరి పంటలోకి నీరు చేరింది. సిరికొండ మండలంలోని తూంపల్లి, పాకాల, చీమన్‌పల్లి గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి.
సిరికొండ నుంచి భీమ్‌గల్ వెళ్లే దారిలో ఉన్న దోండ్ల వాగు వంతెనపై నుంచి వరద పొంగిప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్, రామారెడ్డి గంగమ్మవాగు, రెడ్డిపేటపెద్ద చెరువు, సింగరాయిల్లివాగు అలుగుపారడంతో కామారెడ్డికి రాకపోకల నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపేట మండలం మోతె పంచాయతీ పరిధిలోని బట్టిప్పగడ్డ తండా సమీపంలోని వాగుకు వరద ఉధృతంగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నాగారం గ్రామం వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట్ మండలం గుండారం పెద్ద వాగు, ఎల్లాపూర్ తండా, నడిమి తండా వద్ద ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుడి తండా వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలం వాడి, ఫరీద్‌పేట గ్రామాల శివారులో ఉన్న లొట్టివాగు పొంగి ప్రవహిస్తుండడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూరు, అంతంపల్లి మధ్య ఉన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సిరికొండలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. పాకాలలో గుడిసె కూలడంతో సామగ్రితో కుటుంబీకులు రోడ్డున పడ్డారు. రామారెడ్డిలోని ఓ కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరురావడంతో కుటుంబీకులను స్థానిక నాయకులు పునరావాస కేంద్రానికి తరలించారు.లింగంపేట మండల కేంద్రంలో ఒక నివాస గృహం కూలిపోవడంతో నిరాశ్రయులను స్థానిక యువకులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండల కేంద్రంతో పాటు సజ్జన్పల్లి గ్రామంలో నివాస గృహాల్లోకి వర్షపు నీరు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
రాజంపేట్ మండలంలోని గుండారం గ్రామంలో ఒడ్డె ఎల్లవ్వకు చెందిన గుడిసెలోకి వర్షపు నీరు రావడంతో ఆమె కుటుంబ సభ్యులను అధికారులు పంచాయతీ భవనంలోకి తరలించి పునరావాసం ఏర్పాటు చేశారు.బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు ఆమె కూతురుతో కలిసి ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరగా.. తహసీల్దార్ విఠల్ వారిని బెల్లాల్ పంచాయతీ కార్యాలయంలోకి తరలించారు. రాజంపేట మండలం గుడి తండాలోని ప్రాథమిక పాఠశాల భవనం గోడ కూలింది. మాచారెడ్డి మండలంలోని కాకులగుట్టతండా గ్రామపంచాయతీ పరిధిలోని రెహమత్నగర్ లో నివాసం ఉంటున్న 35 మంది గుడిసెలోకి భారీగా వరద చేరడంతో.. తహసీల్దార్ శ్వేత,ఆర్ఐ మాలిక్ వారిని ఘన్పూర్ లోని ప్రాథమిక పాఠశాలకు తరలించారు.