డిచ్పల్లి/ ధర్పల్లి/ సిరికొండ/ కమ్మర్పల్లి, జనవరి 11: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అకాల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు సిరికొండ మండలంలోని చీమన్పల్లి, రావుట్ల, న్యావనంది, పెద్దవాల్గొట్ తదితర గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. తూంపల్లి గ్రామంలో వర్షానికి వాగు ప్రవహిస్తున్నది. సిరికొండ మండలంలోని తూంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి ఉల్లి, కూరగాయల నారుమళ్లు తదితర పంటలు దెబ్బతిన్నాయి. కోసి ఎండబెట్టిన కంది పంట తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో ఎర్రజొన్న, పసుపు పంటలు వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎర్రజొన్న పంటలో పేనుబంక తెగులు ఆ శించే అవకాశం ఉండడంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కమ్మర్పల్లి మండలంలో సోమవారం ఉదయం నుం చి మంగళవారం ఉదయం వరకు 1.4 సెం టీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి, మంగళ వారం చిరుజల్లులు కురిశాయి. మండలంలో 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటుక బట్టీలు నిర్వహించే వ్యాపారులకు నష్టం జరిగింది. తయారు చేసి ఎండబెట్టిన ఇటుకలు తడిసిపోయాయని తెలిపారు. బిచ్కుంద మండలంలో ఆకాశం పూర్తిగా మబ్బులు పట్టి కనిపించింది. అక్కడక్కడ చిరుజల్లులుకురిశాయి. అకాల వర్షాలతో పూతదశలో ఉన్న శనగ పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంది పంట కోతకు వచ్చిందని, నూర్పిడి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.