కామారెడ్డి రూరల్, మే 18: అన్నదాత ఆగమవుతున్నడు. ధాన్యం కొనుగోళ్ల వేళ ఆదుకునే దిక్కులేక తల్లడిల్లిపోతున్నాడు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించినా సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లపై సమాధానం ఇచ్చేవారులేకపోగా.. మరికొన్నిచోట్ల రైతుల ఇబ్బందులను పట్టించుకునే వారు కరువయ్యారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలకు కావలి ఉన్న రైతులను.. మరోవైపు అకాలవర్షం ఆగమాగం చేస్తోంది. సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అకాల వర్షాలకు కండ్ల ముందే ధాన్యం తడిసిపోవడం అన్నదాతను మరింత కష్టాల్లోకి నెడుతున్నది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు 20 రోజులుగా ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకురాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో కురుస్తున్న అకాల వర్షాలకు వాటికి మొలకలు వస్తున్నాయి.
ఆందోళన బాట
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొనడంతో అకాల వర్షాలకు వడ్ల బస్తాలు తడిసి ముద్దవుతుండడంతో అన్నదాత ఆందోళనబాట పట్టాడు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎదురుచూపులే మిగిలాయి..
అనుకున్న సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలీలు వస్తలేరు. దీంతో మా కుటుంబ సభ్యులందరం ఇక్కడికి వచ్చి కాపలా ఉంటున్నం. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొనుగోళ్లు ఎప్పు డు చేస్తారో అని ఎదురుచూపులే మిగిలాయి.
-సంగి రాజు, రైతు, క్యాసంపల్లి
ఇరవై రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నం.
ఇరవై రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నం. ఇప్పటివరకు కొనుగోలు చేస్తామని ఎవరూ రాలేదు. తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతున్నది. ఏం చేయాలో తోచడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం తూకం జరిగేలా చూడాలి.
-రాజిరెడ్డి, రైతు, క్యాసంపల్లి
వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయి..
భూమిని కౌలుకు తీసుకొని పంట పండించి ఇక్కడికి తెచ్చిన. మొన్న కురిసిన గాలి వానకు ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు కూడా వస్తున్నాయి. సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మేము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలి.