మంచి అలవాట్లతోనే గుండె ధైర్యం
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం... చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి...గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది.
- జీవనశైలిలో మార్పులతోనే..
- లయ తప్పుతున్న హృదయం
- శారీరక శ్రమ లేకపోవడమూ ఒక కారణమే
- ఆహార అలవాట్లు మారాలి
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం… చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి…గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. ఒకప్పుడు వృద్ధుల్లోనే గుండెజబ్బులు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం యువత ఎక్కువగా హృద్రోగాల బారినపడుతున్నారు. అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. అస్తవ్యస్త జీవనశైలి.. వ్యక్తిగత ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకుండా.. కూర్చొని చేసే పనులు, పొగ తాగడం, జంక్‌ఫుడ్స్‌కు అలవాటుపడడమే ఇందుకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలకు దారి తీస్తున్నది. అంతిమంగా గుండెపై ఆ ప్రభావం పడుతున్నది.
కామారెడ్డి/ఖలీల్‌వాడి, మార్చి 9: ఉమ్మడి జిల్లాలో గుండెపోటు మరణాలు జనాలను కలవరపెడుతున్నాయి. జీవితంలో మనిషి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జిమ్ చేస్తూ కొందరు, ఫోన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తూ, సాధారణ పనుల్లో ఉంటూ గుండెపోటుతో కుప్పకూలి అకాల మరణం చెందుతున్నారు. కొందరిలో పోస్ట్ కొవిడ్‌తో ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా గుండెపోటుకు కారణమని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గుండెపోటుకు చాలా మంది బలి అవుతున్నారు. కొవిడ్ సోకి కోలుకున్నా వైరస్ ప్రభావంతో ఎండోథెలియం (గుండె రక్తనాళాల్లోని లోపలి పొర)లో మార్పులు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. యువతీయువకులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణాలు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.
గుండెపోటుకు కారణాలు..
రక్తనాళాలు మూసుకోవడంతో వచ్చే వ్యాధే గుండెపోటు. అధికంగా చక్కెర,ఉప్పు,కొవ్వు పదార్థాలు తినడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతున్నది. దీంతో రక్తసరఫరా నిలిచిపోతుంది. గుండెకు ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు వస్తుంది. ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్‌లో సమయానికి దొరికిన ఆహారాన్ని తింటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. ఆహార నియమాలను పూర్తిగా మరిచిపోయారు. పని ఒత్తిడితో మద్యం, ధూమపానం వంటివి చేస్తుంటారు. ఇది గుండెపోటుకు దారితీస్తున్నది. శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువుతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు. అధిక బరువే కాకుండా బక్కపలచగా ఉన్నవారికి కూడా గుండెపోటు రావడం గమనార్హం.
లక్షణాలు..
- గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. వీటిని తెలుసుకుంటే మృత్యువును జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
- గుండెనొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.
- రక్తం సరఫరా తగ్గితే గుండెలో మంటగా ఉంటుంది.
- గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తుంటుంది.
- మత్తుగా ఉన్నా చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనలుగా అనుమానించాలి.
- తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయొద్దు
- వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు గుండెపోటుకు దారితీస్తాయి.
- శరీరంపై భాగం నుంచి ఎడమ చేతికింద వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.
గుండె జబ్బుల నివారణకు
- ఫాస్ట్ఫుడ్స్, శీతలపానీయాలు వంటి కేలరీలు ఎక్కువగా, తక్కువ పోషకాహారం వంటి వాటిని తగినంత మోతాదులో తీసుకోవాలి.
- కొవ్వు అధికంగా లేని, తక్కువ కొవ్వు ఉండే ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమం.
- ప్రతిరోజూ పండ్లు, కూరగాయలను తింటూ ఉండాలి.
- తక్కువ కొవ్వు మాంసాలు ఉన్న చికెన్, చేపలు, లీన్ కట్స్ మొదలైనవి తీసుకోవాలి.
- ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో 6గ్రాముల కన్నా తక్కువ ఉప్పును తీసుకోవాలి.
- సరిపోయే శారీరక శ్రమ స్థాయిని నిర్వహించాలి.
- వ్యాయామం స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా మధుమేహం, రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు వచ్చే ప్రమాదాలను సగానికి పైగా తగ్గించుకోవచ్చు.
- ప్రతి రోజు 30-45 నిమిషాలు మితమైన, తీవ్రమైన శారీరక శ్రమను కలిగి ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా ఇలా చేయగలగాలి.
- ధూమపానం మానేసిన 24 గంటల్లోపు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుంది.
- ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తపోటు(బీపీ) సాధారణ స్థాయి వివరాలు, రక్తంలో చక్కెరస్థాయి నిల్వలు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవడంతో వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
సీపీఆర్‌తో ప్రాణాన్ని కాపాడండి..
ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలితే సమీపంలో ఉన్నవారు వెంటనే రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయాలి. అనంతరం రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గాలిని గట్టిగా ఊదాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా చేయడాన్ని సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) అంటారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్‌పై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శిక్షణను ప్రారంభించింది. మొదట ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డాక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
అపోహ: గుండె జబ్బు అనేది వృద్ధాప్యంలోనే వచ్చే వ్యాధి…
వాస్తవం: మానవ జీవితంలో పదేండ్లలోనే శరీరంలో కొవ్వు నిల్వలు ప్రారంభమవుతాయి. ఇందులో కొన్ని కారకాలు కొవ్వులను శరీరంలో పేరుకునేటట్లు చేయడంతోనే చిన్న వయస్సులోనే గుండెజబ్బులు వస్తున్నాయి.
- ఈ నెల 5న గాంధారి మండల కేంద్రానికి చెందిన అహ్మద్ (35)కు ఛాతిలో నొప్పి రాగా ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మరణించారు.
- 6న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ స్కూల్ సమీపంలో ఆటోలో ఇంటింటికీ వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తూ ఉండగా మదర్(40)కు ఛాతినొప్పి వచ్చి కిందపడిపోయాడు. స్థానికులు దవాఖానకు తీసుకెళ్లేసరికి మృతిచెందాడు.
- మస్కట్‌లో పని చేస్తూ పట్టణానికి చెందిన మహ్మద్ మోమిన్ (39).. ఫోన్లో మాట్లాడుతూ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33).. ఇలా ఎక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలి మరణించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జీవనవిధానం మారాలి..
మనిషి జీవన విధానంలో మార్పు రావాలి. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ పెరిగే ఆహారాన్ని తీసుకోవద్దు. మందు, సిగరెట్, మాంసం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినొద్దు. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి.
– డా.సాయిలు (ఎండీ, జనరల్ ఫిజీషియన్)
దీర్ఘకాలిక రోగులు జాగ్రత్త..
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం చేయొద్దు. ఒత్తిడి, నిద్రలేమితో గుండెజబ్బులు వస్తాయి. బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండెపోటు రావడానికి ప్రధాన కారణం. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండడం మంచిది. సమయానికి తినడం, వ్యాయామం చేయడం ద్వారా గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
– డాక్టర్ సందీప్‌రావు, గుండె వైద్య నిపుణులు
యువత గుర్తుంచుకోండి..
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమట పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ధూమపానం మానేయాలి. అధిక మద్యపానం మంచిది కాదు. క్రమశిక్షణతో కూడిన క్రియాశీలకమైన జీవనశైలి ముఖ్యం. ఇంట్లో తల్లిదండ్రులకు గుండెజబ్బుల చరిత్ర ఉంటే వారి పిల్లలు కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి.
– డాక్టర్ ప్రతిమారాజ్, జీజీహెచ్, సూపరింటెండెంట్, నిజామాబాద్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

