కంఠేశ్వర్, డిసెంబర్ 12: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న స్థలం తన సొంతమని, ఇందులో ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని ప్లాట్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బావమరిది నగేశ్‌కుమార్ స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కేఆర్ అపార్ట్మెంట్లో నివాసముండే వారు తన ప్లాట్ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వివాదం చేస్తున్న స్థలం రహదారి కాదని, అది తన సొంతమని తెలిపారు. సర్వే నం.219లో 235 గజాల ప్లాట్‌ను కొనుక్కుని, 2018లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పారు.
ఆ ప్లాట్‌కు, అపార్ట్మెంట్ వాసులకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే రహదారి అని చెబుతూ వివాదం సృష్టించి, దానికి రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు. తన స్థలాన్ని కబ్జా చేయాలని యత్నిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత, ఆమె మామ రాంకిషన్‌రావు గురించి ప్రస్తావిస్తున్నారన్నారు. వాస్తవానికి ఈ స్థలంతో వారికి ఎలాంటి సంబంధం లేదని నగేశ్‌కుమార్ స్పష్టం చేశారు. తన వద్ద స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, మున్సిపల్ కార్పొరేషన్‌కు ట్యాక్స్ సైతం చెల్లిస్తున్నానని చెప్పారు. ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. స్థల వివాదానికి ఎమ్మెల్సీ కవిత, రాంకిషన్‌రావుకు ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ దురుద్దేశంతో కొందరు వారి పేర్లు చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ శంకర్ అన్నారు. మరోసారి తమ నాయకుల పేర్లు ప్రస్తావిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.