Nizamabad | పెద్ద కొడప్గల్, మార్చి 04 : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నినాదం లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు. ఆ చెట్లు ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆ వృక్షాలను నరికేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయనే కారణంతో ఈ చెట్లను నరికివేశారు. వృక్షాలు మళ్లీ చిగురించేందుకు వీలు లేకుండా మొదళ్ల వరకు నరికి వేశారు.
ఈ ఘటనపై ఫిబ్రవరి 27న నమస్తే తెలంగాణ దినపత్రికలో హరితహారం చెట్లు నరికివేత అనే కథనం ప్రచురితమైంది. దీనిపై డిఎల్పిఓ నాగరాజు, ఎంపీడీవో లక్ష్మి కాంత్ రెడ్డితో పాటు అటవీశాఖ అధికారులు స్పందించి ఫిబ్రవరి 28న విచారణ చేపట్టారు. చెట్లు నరికివేసిన బాలశేఖర్కు మంగళవారం మండల అధికారులు, అటవీ శాఖ అధికారులు కలిసి రూ. 40 వేలు జరిమానా విధించారు. ఈ జరిమానా చలాన్ ద్వారా బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు. ఇక నరికేసిన చెట్ల స్థానంలో మళ్లీ నాటాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం 12 ఫీట్ల ఎత్తుగల 40 చెట్లను తీసుకొచ్చి సబ్ స్టేషన్ సమీపంలోని కాటేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా వారం రోజుల్లో నాటాలని ఆదేశించారు. వాటిని ఆరు నెలల వరకు సంరక్షించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.