మోర్తాడ్/ఎల్లారెడ్డి రూరల్/నందిపేట్, డిసెంబర్ 5: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్ గురువారం తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో నిర్బంధించిన మాజీ మంత్రి హరీశ్‌రావును కవిత, వేముల ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం కాదని, పోలీసుల రాజ్యం నడుస్తున్నదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తున్నదన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదన్న కవిత.. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధ పాలన విజయోత్సవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. గచ్చిబౌలి ఠాణాలో హరీశ్‌రావును పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పేరుతో నిర్భంధపాలన, ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎక్కడైనా తిరగొచ్చు అంటారు, ఇక్కడ అదే పార్టీ సీఎం మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తుండడం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌రెడ్డి నియంత పాలన చేస్తున్నాడని, దేశంలో ఇంత నీచంగా రాజ్యాంగ ఉల్లంఘన జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మేధావులు ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని
ప్రశ్నించాలని కోరారు.
అరెస్టులు చేస్తే బెదిరేది లేదు.. ప్రజా క్షేత్రంలో రేవంత్‌రెడ్డిని నిలదీస్తూనే ఉంటాం, వెంట పడుతూనే ఉంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. గచ్చిబౌలి ఠాణాలో ఉన్న హరీశ్‌రావును పరామర్శించేందుకు వెళ్తుండగా, జాజాల సురేందర్‌తో పాటు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మోకిలా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఆరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమన్నారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యమంటేనే అంతు లేని హింస అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో సాగుతున్న పోలీసు పాలనతో రాష్ట్రం ఆగమవుతున్నదని గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అక్రమమన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని ప్రజాస్వామ్య పద్ధతిలో ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐని ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఇతర నేతలను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కార్ నిరంకుశత్వానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. హింసాత్మక ఇందిరమ్మ రాజ్యంపై ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరం లేదని హెచ్చరించారు.
డిచ్పల్లి, డిసెంబర్ 5 : రాష్ట్రంలో ప్రజా పాలనే లేదని, పోలీసుల పాలన నడుస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టులను బాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని ప్రజలు, నాయకులను అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఏడాది నుంచి ప్రజా పాలన నడువడం లేదని, పోలీసు పాలనే నడుస్తున్నదన్నారు. పరిపాలన చేయడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు.