ఆర్మూర్, ఫిబ్రవరి 10: చేపూర్లో రైతులు సాగుచేస్తున్న ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం బాగున్నదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు, విజయ్‌కృష్ణ అన్నారు. మండలంలోని చేపూర్ గ్రామంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి అశ్వరావుపేట ఉద్యానవన పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. చేపూర్ నర్సరీలో 2 లక్షల 65 వేల ఆయిల్ పామ్ మొక్కలను రైతులు సరైన యాజమాన్య పద్ధతులతో పెంచుతున్నారని, వారి కృషి బాగుందని శాస్త్రవేత్తలు అన్నారు. 2వ దశలో ఉన్న ఆయిల్ పామ్ మొక్కల పెరుగుదల బాగున్నదని, నర్సరీలో డ్రిప్ వాడకం, దాని ద్వారానే నీరు, ఎరువులను మొక్కలకు అందించడంపై శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు. జిల్లాకు ఇచ్చిన ఆయిల్ పామ్ మొక్కల సాగు లక్ష్యం మేరకు చేపూర్‌లోని ఆయిల్ పామ్ నర్సరీలో అత్యున్నతంగా, సాంకేతిక పద్ధతిలో మొక్కలు పెంచుతున్నట్లు ఉద్యానవన అధికారులు చెప్పారు. అంతకుముందు ఉద్యానవన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ సిబ్బందికి ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలను అందజేశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌దాస్, ఆర్మూర్ ఉద్యానవన శాఖ అధికారి సుమన్, ఆయిల్ పామ్ సంస్థ జనరల్ మేనేజర్ రామ్మోహన్, నర్సరీ మేనేజర్ లోకేశ్, ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.