మోర్తాడ్, అక్టోబర్ 4: పసుపు వాణిజ్య పంట.. ఏడాది కాలం పట్టే ఈ పంట రైతులకు సిరులు కురిపించేది. దీంతో ప్రతి రైతూ ఎంతో కొంత పసుపు సాగుచేసేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పసుపు పండించినా.. దిగుబడులు అంతగా రావడం లేదు. మార్కెట్లో ధర కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నది.
రైతులు పంట సాగుచేసేందుకు వెనుకంజవేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించేందుకు కమ్మర్‌పల్లిలో 2009లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇది ఏకైక పసుపు పరిశోధన కేంద్రం కాగా.. ఇక్కడ శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు పసుపు విత్తనాలు, మొలకలను అందిస్తున్నారు.
15 ఏండ్లుగా సేవలు..
కమ్మర్‌పల్లిలో ఏర్పాటు చేసిన పసుపుపరిశోధన కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లో చేర్చారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులకు 15 ఏండ్లుగా సేవలందుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేంద్రంలో ఐదారు రకాలపై పరిశోధనలు జరుపుతారు. ఇందుకోసం కేంద్రంలో 318 రకాల పసుపు విత్తనాలను దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి సేకరించారు. ఇందులో 50 పసుపు రకాలను ఎంపిక చేసుకొని ఏటా ఐదారు పసుపు రకాలపై పరిశోధనలు చేస్తారు. ఇందులో దిగుబడినిచ్చే రకాలను రైతులకు విత్తనంగా అందజేస్తారు.
పరిశోధన కేంద్రంలో మొలకలు వచ్చిన పసుపును కూడా రైతులకు సరఫరా చేస్తారు. పసుపుపరిశోధన కేంద్రానికి మొత్తం 30 ఎకరాల స్థలం కేటాయించగా.. 25 ఎకరాలు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం విత్తనాలు కూలీలతో తయారు చేయించి, విత్తన శుద్ధి చేసిన అనంతరం కూలీలతో బెడ్ సిస్టమ్ ద్వారా పసుపు విత్తనాలు వేసి పంటను పండిస్తుంటారు. ఇందు కోసం డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. పసుపుతో పాటు అల్లంసాగుకు సంబంధించిన పరిశోధనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పంటలకు నీటిని అందించేందుకు పరిశోధన కేంద్రంలోనే బావిని తవ్వారు.
యంత్రాల తయారీ..
పసుపు, అల్లం పండించే రైతులకోసం పసుపు పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో యంత్రాలను తయారు చేయించారు. పసుపు ఉడకబెట్టడం, పసుపుతవ్వడం, పసుపును పాలిషింగ్ చేయడం ఖర్చుతో కూడుకున్న పనులు. పసుపు ఉడకబెట్టే యంత్రం ప్రస్తుతం మార్కెట్లో రూ.5లక్షల వరకు ఉన్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు తయారు చేసిన పసుపు ఉడకబెట్టే యంత్రం కేవలం రూ.30వేలు మత్రమే. పసుపు తవ్వేయంత్రాన్ని రూ.1,400కు, పాలిషింగ్ యంత్రాన్ని రూ.7,500కు తయారు చేయించారు. రైతులు తమను సంప్రదిస్తే యంత్రం పనితీరును వివరించి, తయారు చేయించుకునే అవకాశం కల్పిస్తామని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇతర జిల్లాలకు విత్తనాల పంపిణీ..
పసుపు పరిశోధన కేంద్రంలో తయారు చేసిన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు ఏటా అందజేస్తారు. ఇప్పటి వరకు ఈ కేంద్రం నుంచి ఉమ్మడి నిజామాబాద్జిల్లాతోపాటు, నిర్మల్, జగిత్యాల, వరంగల్, మహబూబాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చిన రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు క్వింటాలు వరకు విత్తనాలు అందజేశారు. విత్తనాలే కాకుండా పసుపు మొలకలను కూడా ఈ కేంద్రం నుంచి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం కేంద్రంలో పంపిణీకి సిద్దంగా మొలకలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే రైతు అవగాహన సదస్సులకు ఇక్కడి శాస్త్రవేత్తలు హాజరై వారు సాధించిన ఫలితాలు, పంట సాగు, యాజమాన్య పద్ధతులను వివరిస్తుంటారు.
ఇప్పటివరకు జరిపిన పరిశోధనలు ఇవీ..
ఇక్కడ ఎంపిక చేసిన 50 రకాల్లో జేటీఎస్-605, జేటీఎస్-154 రకాలు అధిక దిగుబడులను ఇచ్చాయి. పది పసుపు రకాలను వివిధ రాష్ర్టాల నుంచి తెప్పించి.. పరిశోధించగా ఇందులో టీ4-మేఘ, టీ7 దుగ్గిరాల ఎరుపు మంచి గుణాలతో దిగుబడి ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు సాధించిన విషయాలను రైతులకు ఎప్పటికప్పుడు వివరిస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో పసుపు, అల్లం సాగు, సూక్ష్మపోషకాల బూస్టర్ ద్వారా వాటి దిగుబడి పెంచడం, పీజీపీఆర్ జీవ గుళికలతో దిగుబడి పెంచడం, ట్రైకోఫ్రైమ్తో పసుసు, అల్లం విత్తనశుద్ధి, పసుపుతవ్వడంలో యాంత్రీకరణ, పసుపులో మల్చింగ్ విధానం, తదితర అంశాలపై రైతులకు పరిశోధనలతో కూడిన అవగాహన కల్పిస్తున్నారు.
ఎప్పుడు అడిగినా సలహాలు ఇస్తున్నారు.
పసుపు పంట సాగులో ఎలాంటి సందేహాలు వచ్చినా.. కేవలం ఫోన్ చేస్తే చాలు ఇక్కడి శాస్త్రవేత్తలు స్పందిస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పంటలో ఏదై నా తెగులు వ్యాపించినా.. ఏ మందులు..? ఎంత మోతాదులో.. ఎప్పుడు వాడాలి.. ? అని వివరంగా చెప్తున్నారు. దీని వల్ల పసుపు సాగులో ఇబ్బందులు లేకుండా పోయాయి. పసుపు పరిశోధనా కేంద్రం అందుబాటులో ఉండడం మాకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్నది.
– అయోధ్య సురేశ్, పసుపు రైతు, హాసాకొత్తూర్
ఏటా పరిశోధనలు జరుపుతున్నాం..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి సూచనల మేరకు పరిశోధనలు జరుపుతున్నాం. వేటి పై పరిశోధనలు జరపాలి అని వారు సూచిస్తారు.. వాటి పైనే పరిశోధనలు చేసి, వచ్చిన ఫలితాలను రైతులకు వివరిస్తాం. నూతన వంగడాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం తదితర అంశాలపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తాం. తక్కువ ఖర్చుతో యంత్రాలను కూడా తయారు చేయించాం.
– మహేందర్, శాస్త్రవేత్త, పసుపు పరిశోధనా కేంద్రం