నిజామాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సం ఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఏక కాలంలో ఒకే సమయంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టి.జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలోనే వీరి పదవీ కాలం ముగియనున్నది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఈసీ పేర్కొన్నది. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. నామినేషన్ల గడవు ముగిసిన అనంతరం 12 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ప్రాధాన్యత ఓటు హక్కు ఆధారంగా బ్యాలెట్ రూపంలో పోలింగ్ ఉండడంతో ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నది. మార్చి 8 నాటికి ఎన్నికల కోడ్ ముగియడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 46,469 మంది పట్టభద్రులు…
ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 46,469 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య భారీగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో ఓటరు నమోదు జరుగలేదు. జిల్లా ఎన్నికల అధికారి పాత్రను పోషించే కలెక్టర్లు ఈ ఎన్నికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఓటు హక్కు నమోదుకు ప్రచారం నిర్వహించలేదు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో మొత్తం రెండున్నర లక్షల మంది వరకు పట్టభద్రుల ఓటర్లు ఉండే అవకాశం ఉన్నది.
నిజామాబాద్ జిల్లాలో 30,593 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 11,225 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 19,368 మంది ఉన్నారు.కామారెడ్డి జిల్లాలో మొత్తం 15,876 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,588 మంది ఉండగా, పురుష ఓటర్లు 11,288 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసింది.
ఉపాధ్యాయ ఓటర్ల వివరాలివీ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,590 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో 3,529 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 1429 మంది, పురుషులు 2100 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 2061 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా వీరిలో మహిళా ఓటర్లు 720, పురుష ఓటర్లు 1341 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం నిజామాబాద్లో 33 , కామారెడ్డి జిల్లాలో 25 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులకు 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివిధ విద్యా సంస్థల యజమానులు, వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందించిన వారంతా పోటీలో నిలబడేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం, ఫిబ్రవరి 3న నోటిఫికేషన్తో పాటు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండడంతో అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. మరోవైపు షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతోపాటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలేవీ జరగడానికి అవకాశం లేదు.