సుభాష్‌నగర్, జనవరి 1: ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ఆలయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంటర్నెట్లో నిక్షిప్తం చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. కామారెడ్డి, నిజామాబాద్‌లలో ఉన్న ఆలయాలన్నింటినీ సులభంగా గుర్తించేలా, వాటి అధీనంలోని భూములు, ఆస్తుల వివరాలు తెలియజేసేలా మొబైల్‌యాప్‌ను రూపొందిస్తున్నది. ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఆ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుండటం విశేషం. ఇందుకు అన్ని ఆలయాల సమాచారాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)తో అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేసింది.
ఆలయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం మూడు నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో జీపీఎస్ నమోదు ప్రక్రియను చేపట్టారు. ఆలయం ఎక్కడ ఉంది. దాని సరిహద్దులేమిటి, దీని పరిధిలోకి వచ్చే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ సర్వే నంబర్లలో ఉన్నాయి.. ఇలా ప్రతి అంశం అందరికీ తెలిసేలా ఆధునిక సాంకేతికతతో సమాచారం పొందుపరిచారు. దేవాదాయశాఖ పరిధిలో పబ్లికేషన్, రిజిస్టర్లో నమోదుతో పాటు ధూపదీప నైవేద్యం కింద ఎంపికైన ఆలయాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,357 ఆలయాలు ఉన్నాయి. ధూపదీప నైవేద్య పథకం కింద 600 ఆలయాలను జీపీఎస్ కింద నమోదు చేశారు. ఈవోలు, సిబ్బందితో జీపీఎస్ మ్యాప్ కెమెరా యాప్‌లో చిత్రాలు తీయించి అక్షాంశాలు, రేఖాంశాలు, ప్రాంతం ఆధారంగా సమాచారాన్ని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. అక్కడ జియో ట్యాగింగ్‌తో నిర్ధారిస్తారు. దీంతో గూగుల్ మ్యాప్‌లో సమాచారమంతా నిక్షిప్తమవుతుంది. తద్వారా మనం శోధించే ఆలయానికి సంబంధించిన సమాచారం తెరపై ప్రత్యక్షమవుతుంది.
ఉమ్మడి జిల్లాలో 384 ఆలయాలకు 4,153. 25 ఎకరాల మాన్యం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని 247 ఆలయాల పరిధిలో 2,287.18 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలోని 137 ఆలయాల పరిధిలో 1,866.06 ఎకరాలు ఉన్నట్లు భూ రికార్డులు చెబుతున్నాయి. ఆయా ఆలయాలకు చెందిన భూములు, ఆస్తుల వివరాలను సైతం చిత్రాల ద్వారా సేకరిస్తున్నారు. ధరణి వెబ్సైట్లో జియోగ్రఫీ ఇన్పర్మేషన్ సిస్టం (జీఐఎస్) ద్వారా వాటిని పరిశీలించి భూముల సరిహద్దులను మార్కింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత జియో ట్యాగింగ్‌లో జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేస్తారు. తద్వారా భూములు కబ్జాకు గురి కాకుండా ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
దేవాదాయశాఖ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆలయాల వివరాలను జియో ట్యాగింగ్ చేస్తున్నాం. పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఆలయాల భూములు, ఆస్తులను పక్కాగా సంరక్షించడానికి ఇదెంతో ఉపయోగపడనున్నది. కబ్జాదారులపై సెక్షన్ 83 ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– శ్రీరాం రవీందర్‌గుప్తా, ఇన్చార్జి సహాయ కమిషనర్