నవీపేట,మే 10: రెండు నెలల బకాయి వేతనాలతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్వాడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీకి ఏడాదికి సంతల ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడం బాధాకరమన్నారు. తక్షణమే కార్మికులకు వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తమకు వేతనాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమండ్ చేస్తూ కార్మికులు ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి ఎంపీవో రామకృష్ణ, ఎంపీడీవో నాగనాథ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలోగ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల్ గంగాధర్ , మండల అధ్యక్షుడు అంజనేయులు , కార్మికులు పాల్గొన్నారు.