బిచ్కుంద, సెప్టెంబర్ 23: పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదని సీఐటీయూ నేత సురేశ్ గొండ అన్నారు. ఒక్కో జీపీ పరిధిలో పది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, జీతాలు ఇవ్వకుంటే కార్మికులు కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.26 వేల కనీస వేతనంతో పాటు ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.