మక్క కొనుగోళ్లు ఎప్పుడు?
రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళారులు రైతులను దోచుకుంటున్నారు.
- ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని ప్రభుత్వం
- ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
- వాయిదాలుగా డబ్బుల చెల్లింపు
- మోసపోతున్నామంటూ అన్నదాత ఆందోళన
రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని మక్కలను కొనుగోలు చేస్తున్న దళారులు డబ్బులు మాత్రం వాయిదాల రూపంలో చెల్లిస్తామంటూ చెబుతున్నారు. అటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోపాటు రోడ్లపైనే ఎన్ని రోజులంటూ మక్కలు ఆరబెడతామని, గత్యంతరం లేక దళారులకు విక్రయించాల్సి వస్తున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
-పెద్దకొడప్గల్, ఏప్రిల్ 3
పెద్దకొడప్గల్లో 986ఎకరాల్లో మక్క సాగు..
పెద్దకొడప్గల్ మండలంలో 986 ఎకరాల్లో మక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ప్రధానంగా బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, అంజని, బుర్గుపల్లి, పెద్ద దేవీసింగ్తండా, పోచారం, పోచారం తండా, సముందర్ తండా, విఠల్వాడి, లింగంపల్లి, కాటేపల్లి, కాటేపల్లి తండా, జగన్నాథ్పల్లి తదితర గ్రామాల్లో మక్క సాగుచేశారు. ఆరుతడి పంట కావడంతో మక్కజొన్న సాగుకే రైతులు మక్కువ చూపారు. కాగా ఏటా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తున్నారు.
వాయిదాల చాటున మోసపోయే అవకాశం..
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలు మక్కలకు రూ.2000 నుంచి రూ.2300 ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు విక్రయానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువ పలుకుతుండడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. వాయిదాల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. గతంలో ఇదే మాదిరిగా మక్కలు కొనుగోలు చేసిన కొంతమంది వ్యాపారులు డబ్బులు చెల్లించకుండా ఉడాయించారని, దీంతో చాలా మంది నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రైవేట్ వ్యాపారులకు మక్కలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది రైతులు మాత్రం ప్రభుత్వం మక్కజొన్న కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
దళారులకు అమ్మి మోసపోతున్నాం
నాలుగు ఎకరాల్లో మక్కవేశాను. 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం లేక దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ధరతో కొని, వాయిదాలు పెట్టి ఉడాయిస్తున్నారు. గతంలో కాస్లాబాద్ గ్రామంలో 5 నుంచి 6లోడ్ల మక్కలు కొనుగోలు చేసి పారిపోయాడు. వెంటనే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.
– రాగేశ్ మచ్చేందర్, రైతు, బేగంపూర్
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో పండించిన మక్కలను రోడ్లపైనే ఆరబెడుతున్నాం. కేసీఆర్ హయాంలో పంట చేతికొచ్చే సమయానికి మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేది. ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులకు అమ్మి మోసపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మక్కలు కొనుగోలు చేయాలి.
– కొండా హన్మాండ్లు, రైతు,పెద్దకొడప్గల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

