కోటగిరి : ఎస్సీ వర్గీకరణ (SC classification) కోసం పోరాడి అమరులైన కుటుంబాలను తక్షణమే రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్(MRPS) జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం 11 మంది అమరులైన వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ వర్గీకరణ కోసం అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరులైన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. హైదరాబాద్లో ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించి మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. అమరులైన వారి కోసం స్తూపాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ 11 శాతం రిజర్వేషన్ అమలు చేసి కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, దినేష్, పోతురాజు రవి,సాయిలు యాదవ్,సంజు, గడ్డం సాయిలు, కృష్ణ,రాములు,సంగయ్య, అబ్బయ్య తదితరులు ఉన్నారు.