బాల్కొండ : పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ( MEO Battu Rajeshwar) అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో విద్యను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence ) ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు.
మండలంలోని చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలల, కిసాన్నగర్లోని ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యసన పద్ధతులను, సాంకేతిక ప్రమాణాల పెంపునకు ఏ ఐ ఎంతో దోహదం చేస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఉపయోగించడానికి డిజిటల్ ( Digital ) పద్ధతులపై పూర్తిస్థాయిలో ఇదివరకే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.
ఏఐ పద్ధతి ద్వారా విద్యార్థులు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో గుర్తించి విద్యార్థుల్లో చదవడం, రాయడం లెక్కలు చేయడం వంటి సామర్ధ్యాలను పెంపొందించడానికి ఏఐ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.