నాగిరెడ్డిపేట, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో వృద్ధులు, మహిళలు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పటివరకూ పింఛన్ల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. జూన్ పోయి జూలై వచ్చినా పింఛన్లపై పూర్తిస్థాయిలో స్పష్టత రాకపోవడం గమనార్హం. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున పింఛన్ల జాబితా ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లు మాత్రమే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించినా, పింఛన్ల మంజూరుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో ఆశ పడిన వారికి ఆశ భంగం కలిగింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సోషల్మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలా మంది మీసేవలో దరఖాస్తు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. అయితే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సైట్ లేదని తెలిసింది. కొందరు దరఖాస్తుదారులు పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, రాగానే దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు. గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సాంకేతిక సమస్యతో పింఛన్లు మంజూరుకాలేదు. నాగిరెడ్డిపేట మండలంలో 5,572 మంది పింఛన్దారులు ఉన్నారు. 1,778 మంది వృద్ధాప్య, 2,317 మంది వితంతువులు,794 మంది దివ్యాంగులు, 28 మంది గీతాకార్మికులు, 36 మంది చేనేత కార్మికులు, 300 మంది బీడీ కార్మికులు, 319 మంది ఒంటరి మహిళలు ఉన్నారు.
పింఛన్ కోసం దరఖాస్తుచేసి నెల దాటింది. కానీ ఎవరూ దీనిపై సమాధానం ఇవ్వడంలేదు. పింఛన్ మంజూ రు చేసి ఆదుకోవాలి.
-కెతావత్ సంతు
కొత్త పింఛన్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం. అధికారులకు అడిగితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు అంటున్నారు.
-అయ్యపల్లి రాములు
కొత్త పింఛన్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. గతంలో దరఖాస్తులు చేసుకున్నవి పెండింగ్లో ఉన్నాయి.
-గంగాధర్, ఎంపీడీవో, నాగిరెడ్డిపేట