భిక్కనూరు, మార్చి 14: గూగుల్ మ్యాప్ మరో మార్గం చూపించడంతో ఓ కుటుంబం ప్రమాదం బారిన పడింది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తుండడంతో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన ఓ కుటుంబం శుక్రవారం వేకువజామున ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ ఆలయానికి కారులో బయల్దేరింది.
సదరు కుటుంబీకులు గూగుల్ మ్యాప్ ద్వారా బాసరకు వస్తుండగా భిక్కనూరు మండలం 44వ జాతీయ రహదారిని చూపించకుండా తహసీల్ ఆఫీస్ నుంచి లోకేషన్ చూపించింది. దీంతో వారు భిక్కనూరు నుంచి అంతంపల్లి గ్రామం వరకు నూతన బీటీ రోడ్డు వేయగా ఆ మార్గం గుండా వెళ్లసాగారు.
కారు నడుపుతున్న కుటుంబ యజమాని నిద్రమత్తులో ఉండడంతో కారు రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లి, బురదలో చిక్కుకొని అక్కడే ఆగిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో కారులో ప్రయాణిస్తున్నవారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కాలువలోకి దూసుకెళ్లిన కారును జేసీబీ సాయంతో బయటికి తీయించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనంతరం వారు బాసరకు బయల్దేరారు.