కామారెడ్డి, జనవరి 30: కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీవర్ సర్వే సత్ఫలితాలు ఇచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 21 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించిన జ్వర సర్వే విజయవంతమైంది. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులను అందజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వేతో ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడంపాటు కొవిడ్ వ్యాప్తి నివారణకు అడ్డుకట్టు వేసినట్లయ్యింది. మొదటి, రెండో వేవ్‌లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సర్వే నిర్వహించగా.. ప్రతి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. మూడో వేవ్‌తో ప్రమాదం పొంచిఉన్నదని కొన్నిరోజులుగా వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేశాయి. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి ఇంటివద్ద మందులు, హోం ఐసొలేషన్ కిట్లు పంపిణీ చేయడంతో మహమ్మారి నియంత్రణలోకి వచ్చినట్లయ్యిందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 2,40,117 కుటుంబాల్లో సర్వే జిల్లా వ్యాప్తంగా మొత్తం 856 ఆరోగ్య బృందాలు ఇంటింటి సర్వేలో పాల్గొన్నాయి. జిల్లాలో మొత్తం 2,40,957 కుటుంబాలు ఉండగా.. 2,40,117 కుటుంబాలను సర్వే చేశాయి. ఇందులో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర సమస్యలతో బాధపడుతున్న 48,882 మందిని గుర్తించాయి. వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను బృందం సభ్యులు వివరించారు. వైద్యశాఖ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో బృందాలు ఏర్పాటు చేయగా, మొత్తం 526 గ్రామాల్లో సర్వే చేపట్టాయి. ఒక్కో బృందం ప్రతిరోజూ 50 నుంచి వంద ఇండ్లలో సర్వే చేపట్టగా.. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఎంహెచ్‌వో కల్పనాకాంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ప్రతి పీహెచ్సీలో కొవిడ్ ఓపీ సేవలు
జిల్లాలో ప్రతి పీహెచ్సీలో కరోనా ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. దవాఖానకు వచ్చే వారికి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్‌ను వినియోగించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనవసరంగా జనసమూహాల్లోకి వెళ్లవద్దన్నారు. లక్షణాలు ఉన్నవారికి మందులను అందజేశారు.
కరోనా తగ్గుముఖం
కరోనా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో వందశాతం మొదటి డోస్ పూర్తిచేస్తాం. రెండో డోస్ వ్యాక్సినేషన్లో వేగం పెంచుతున్నాం. ప్రస్తుతం బూస్టర్ డోస్‌ను అందిస్తూనే ఇంటింటి సర్వే నిర్వహిం చాం. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లను అందించాం. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి.
-కల్పనా కాంటే, డీఎంహెచ్‌వో
మూడో వేవ్ ప్రభావం లేదు
కొవిడ్, ఒమిక్రాన్, డెల్టా వేరి యంట్ వంటి ప్రభావం ప్రస్తుతం తక్కువస్థాయిలో ఉంది. చాలా మందికి కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. గతంలో మాదిరిగా తీవ్రత లేకపోవడం శుభపరిణామం. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందిస్తున్నాం. అన్ని దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
-డాక్టర్ అజయ్ కుమార్,సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లా దవాఖాన