మాక్లూర్, మే 30: నాలుగేండ్ల చిన్నారిని గొంతు నులిమి హత్యచేశాడో కిరాతకుడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో ఈ హృదయవిదారక ఘటన గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై సుధీర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మోరాకు చెందిన ఈర్నాల అరుణ్, నిజామాబాద్‌కు చెందిన సునీతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటికే సునీతకు పెళ్లయి, బిడ్డ కూడా ఉంది. ఆమెను వివాహం చేసుకున్న అరుణ్.. సునీతతో పాటు కూతురు లక్కీ(4)ని కూడా తీసుకెళ్లాడు. అయితే, మొదటి భర్తకు జన్మించిన పాపపై ఇష్టం లేని అరుణ్.. బిడ్డ ఇంట్లో ఉండొద్దని తరచూ భార్యతో గొడవ పడేవాడు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం లక్కీని కొట్టి చేయి విరిచేశాడు. అప్పటి నుంచి సునీత పాపను నిజామాబాద్‌లో ఉండే తల్లి గారింటికి పంపించేసింది. అయితే, బుధవారం తన కూతుర్ని చూడాలని భర్తను కోరగా, అతడు నిజామాబాద్ వెళ్లి పాపను ధర్మోరాకు తీసుకొచ్చాడు. రాత్రి లక్కీ నిద్రిస్తుండగా, సునీత స్నానానికి వెళ్లింది. దీంతో అరుణ్ నిద్రలో ఉన్న పాప గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న నార్త్ రూరల్ సీఐ సతీశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నిజామాబాద్ దవాఖానకు తరలించిన పోలీసులు.. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.